యువరత్న నందమూరి బాలకృష్ణ పైకి ఎంత గాంభీర్యంగా ఉంటారో లోపల ఆయన మనసు అంత వెన్న. బాలయ్యలో పైకి కనపడని సేవా మూర్తి దాగి ఉన్నాడు. చిన్న చిన్న సాయాలు చేసిన ఈ రోజుల్లో సోషల్ మీడియాల్లో ఫొటోలు పెడుతూ పెద్ద డబ్బాలు కొట్టించుకుంటున్నారు. పైగా చేసిన బెత్తడు సాయానికి పీఆర్వో టీంలో చాంతాడంత ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వీటికి బాలయ్య పూర్తిగా దూరంగా ఉంటారు. చేసిన సేవాకార్యక్రమాలకు డబ్బాలు కొట్టించుకోవడం ఆయనకు ఏ మాత్రం ఇష్టం ఉండదు.
ఆయన నుంచి సాయం పొందిన వారు ఎవరైనా స్వచ్ఛందంగా చెపితే తప్పా బాలయ్య చేసిన ఎన్నో మంచి పనులు బయటకు కూడా రావు. తాజాగా బాలయ్య చేసిన ఓ మంచి పనిని అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా సింగర్ ఎస్పీ చరణ్ చెప్పి బాలయ్య మనసు ఎంత గొప్పదో చాటి చెప్పాడు. అఖండ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్పీ. చరణ్ మాట్లాడారు.
దివంగత లెజెండ్రీ సింగర్ ఎస్పీ, బాలసుబ్రహ్మణ్యం తనయుడు అయిన చరణ్ ఈ సినిమాలో ఓ పాట పాడారు. బాలయ్య సినిమాలో చరణ్ పాట పాడడం ఇదే మొదటిసారి. ఈ క్రమంలోనే చరణ్ బాలయ్య గొప్పతనం గురించి చెప్పారు. తన తండ్రి బాల సుబ్రహ్మణ్యం గారు బాలయ్య గారు నటించిన ఎన్నో సినిమాల్లో పాటలు పాడారని.. అయితే ఇన్నాళ్లకు తనకు ఆయన సినిమాలో పాటలు పాడే అదృష్టం రావడం గొప్ప విషయమని చెప్పారు.
ఇక మా నాన్న గారు ఆసుపత్రిలో ఉన్న సమయంలో బాలయ్య గారు పూజలు చేయించడంతో పాటు నాన్న గారు కోలుకోవాలని ప్రార్థనలు కూడా చేశారని.. పదే పదే మా కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకునే వారని చరణ్ గుర్తు చేసుకున్నారు. ఆయన మా కుటుంబంపై చూపించిన ప్రేమ తాను ఎప్పటకీ మరచిపోలేనని చరణ్ చెప్పారు.