ప్రస్తుతం టాలీవుడ్ లో నిర్మాణంలో ఉన్న సినిమాల్లో అత్యంత ఆసక్తి రేపుతున్న సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్. వకీల్ సాబ్ తర్వాత పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమాకు సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. భీమ్లా నాయక్ మలయాళంలో హిట్టయిన అయ్యప్ప కోషియమం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన స్టిల్స్, ప్రోమోలతో పాటు పాటలు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.
వాస్తవానికి సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. అయితే సంక్రాంతికి ట్రిబుల్ ఆర్ సినిమాతో పాటు ప్రభాస్ రాధే శ్యామ్ లైన్లో ఉన్నాయి. ఈ భారీ బడ్జెట్ సినిమాను రెండు పెద్ద సినిమాలకు పోటీగా రిలీజ్ చేయడం కంటే సోలోగా రిలీజ్ చేస్తే భారీ కలెక్షన్లు వస్తాయని నిర్మాతలు అంచనా వేస్తున్నారు. అందుకే భీమ్లా నాయక్ సమ్మర్‌కు వాయిదా పడవచ్చని వినిపిస్తోంది.
ఈ సినిమా గురించి వినిపిస్తోన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే రన్ టైం విషయంలో నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. మలయాళంలో ఈ సినిమా మొత్తం 175 నిమిషాల నిడివితో ఉంటుంది. అయితే తెలుగులో అంత సేపు ఈ సినిమాను ప్రేక్షకులు చూస్తారా ? లేదా ఎక్కడైనా బోర్ ఫీలింగ్ వస్తే ఇబ్బంది అవుతుందని అరగంట పాటు రన్ టైంను తగ్గించినట్టు తెలుస్తోంది.
ఒరిజినల్ సినిమాలో ఉన్న కొన్ని సన్నివేశాలను వదిలేసి… క్రిస్పీగా తెరకెక్కిస్తున్నారు. ఓ మాజీ సైనికుడికి పట్టుదల గల పోలీసు అధికారికి మధ్య జరిగే కథాంశంతో భీమ్లా నాయక్ తెరకెక్కుతోంది. థమన్ ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నారు.