మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఆయనకు చాలా తీవ్ర గాయలయ్యాయి. కేబుల్ బ్రిడ్జ్, ఐకియా రూట్లో తన స్పోర్ట్స్ బైక్ మీదనుంచి అదుపుతప్పి క్రిందపడ్డారు సాయి తేజ్. ఈ యాక్సిడెంట్లో ఆయన కుడి కన్ను, ఛాతిపై బలమైన గాయాలు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో వెంటనే ఆయన్ను దగ్గర్లోని మెడికవర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స్ కోసం అక్కడి నుంచి అపోలో షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజా హెల్త్ బులెటిన్ ను అపోలో ఆస్పత్రి వైద్యులు విడుదల చేశారు. సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సాయి ధరమ్ తేజ్ కాలర్ బోన్ కు వైద్యులు సర్జరీ చేశారు. సర్జరీ విజయవంతంగా పూర్తయ్యిందని, మరో 24 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచనున్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రమాద సమయంలో సాయి ధరమ్ తేజ్ కి కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయ్యింది. ఆయనకు కన్ను, ఛాతి భాగంలో గాయాలయ్యాయి. శరీరం లోపల మాత్రం ఎలాంటి రక్తస్రావం జరగలేదని అపోలో వైద్యులు తెలిపారు.
మెగా హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డుప్రమాదంపై మాదాపూర్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీ విడుదల చేశారు. హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి సమీపంలోని ఐకియా స్టోర్ వద్ద స్పోర్ట్స్ బైక్ నుంచి సాయిధరమ్‌తేజ్ కిందపడిపోయాడు. ఘటనా స్థలంలో మట్టి, ఇసుక ఉండటంతో అతడి బైక్ స్కిడ్ అయిందని పోలీసులు తెలిపారు. ఇక సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని పలువురు సినీ సెలబ్రీటీల తో పాటు ఆయన అభిమానులు సామాన్యులు కూడా కోరుకుంటున్నారు.