కేంద్రం ప్రభుత్వం థియేటర్లకు అన్ లాక్ చేసినా దేశవ్యాప్తంగా థియేటర్లు ప్రారంభించే విషయంలో నిర్వాహకులు అనేక తర్జన భర్జనలు పడుతున్నారు. మొన్న వైజాగ్‌లో ఓ థియేటర్లో సినిమా వేస్తే ఉదయం ఆటకు రు. 500 కలెక్షన్ కూడా రాలేదు. ఇక ఇప్పుడు తాజాగా విజయవాడలో అన్నీ మల్టీఫ్లెక్స్‌లను ఓపెన్ చేశారు. కేవలం 50 శాతం సీట్లతో రోజుకు మూడు చొప్పున మల్టీఫ్లెక్స్‌లను ఓపెన్ చేసినా జనాలు రావట్లేదు. కనీసం 10 శాతం టిక్కెట్లు కూడా తెగకపోవడంతో థియేటర్ల నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు.
అయితే పాత సినిమాలనే వేయడం.. ఇంకా కరోనా మూడ్ నుంచి ప్రజలు బయటకు రాకపోవడంతో జనాలు మళ్లీ థియేటర్లలో సినిమాలు చూసేందుకు ఇంకా అలవాటు పడలేదు. సుమారు ఎనిమిది నెలల తర్వాత విజయవాడలో మళ్లీ బొమ్మ పడింది. కొత్త సినిమాలు రిలీజ్ అవ్వడంతో పాటు.. మంచి టాక్ వస్తే ప్రేక్షకులు నెమ్మదిగా మళ్లీ సినిమాలు చూసేందుకు థియేటర్లకు వస్తారని భావిస్తున్నారు. ప్రస్తుతానికి మల్టీఫ్లెక్స్‌లు ఓపెన్ చేస్తేనే జనాలు పట్టించుకోవడం లేదు. ఇక సింగిల్ థియేటర్ల పరిస్థితి కూడా అలాగే ఉండేలా ఉంది.