2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన తెలుగుదేశం పార్టీకి తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కసరత్తులు ప్రారంభించేశారు. 2024 ఎన్నికలు పార్టీకి చావోరేవో లాంటివే. ఈ క్రమంలోనే పార్టీకి జవసత్వాలు తీసుకువచ్చేందుకు చంద్రబాబు పార్టీకి వ్యూహకర్తగా రాబిన్ శర్మను నియమించారు. రాబిన్ శర్మ ఎవరో కాదు. పంజాబ్‌కు చెందిన విశ్లేషకుడు. గత ఎన్నికల్లో జగన్‌ను అధికారంలోకి తీసుకు రావడంలో కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ టీంలో కీలక సభ్యుడు.
ఇప్పటికే రాబిన్‌శర్మ టీం క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగినట్టు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే పార్లమెంటరీ నియోజకవర్గాల వారిగా పార్టీ కమిటీలు నియమించిన చంద్రబాబు స్టేట్ కమిటీని ప్రకటించాల్సి ఉన్నా వాయిదా వేశారు. ఇందుకు రాబిన్ శర్మ నివేదిక రావడం ఆలస్యం కావడమే అని తెలుస్తోంది. రాబిన్ శర్మ టీం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు పర్యటిస్తూ ఏయే నియోకవర్గాల్లో పార్టీ బలంగా ఉంది ? ఎక్కడ ఎవరెవరు యాక్టివ్‌గా ఉన్నారు ? అన్న దానిపై నివేదికలు తెప్పించుకుంటోంది.
ఎవరు అయితే పార్టీలో యాక్టివ్‌గా ఉండడం లేదో ? ఎవరు అయితే నియోజకవర్గాల బాధ్యులుగా ఉండి కూడా జనాల్లోకి వెళ్లడం లేదో వారికి షాక్ తప్పదనే అంటున్నారు. రాబిన్ శర్మ టీం ఈ విషయంలో చాలా పగడ్బందీ ప్లాన్‌తో వ్యూహాలు పన్నుతోందట.