Newsప‌చ్చ‌ని కాపురంలో ఫేస్‌బుక్ చిచ్చు... సినిమాను త‌ల‌పించే ట్విస్టులు

ప‌చ్చ‌ని కాపురంలో ఫేస్‌బుక్ చిచ్చు… సినిమాను త‌ల‌పించే ట్విస్టులు

పెళ్ల‌యిన ఓ యువ‌తి పేరుతో న‌కీలీ ఫేస్‌బుక్ అక్కౌంట్ ఓపెన్ చేసిన ఓ నిందితుడు ఆమె స్నేహితుల‌తో త‌న భ‌ర్త మంచివాడు కాదంటూ చాటింగ్ చేశాడు. చివ‌ర‌కు ఈ విష‌యం తెలిసిన భ‌ర్త ఆమెను పుట్టింటికి పంపేశాడు. సినిమాను త‌ల‌పించిన ఈ క‌థ వివ‌రాలు చూస్తే తెలంగాణలోని సూర్యాపేట జిల్లా నూత‌న్‌క‌ల్ మండ‌ల కేంద్రానికి చెందిన పెద్దింటి కిరణ్‌కుమార్‌రెడ్డి తండ్రికి జేసీబీలున్నాయి. వాటిని చూసుకుంటూ ఫేస్‌బుక్‌లో అమ్మాయిల ఫొటోలు డౌన్‌లోడ్ చేసి వాటితో న‌కిలీ అక్కౌంట్లు క్రియేట్ చేసి ఎవ‌రి పేరుతో అక్కౌంట్ క్రియేట్ చేశాడో వారి ఫ్రెండ్స్‌తోనే చాటింగ్ చేస్తుంటాడు.

 

ఈ క్ర‌మంలోనే పెళ్ల‌యిన ఓ యువ‌తి ఫొటోతో న‌కిలీ అక్కౌంట్ క్రియేట్ చేసి ఆమె ఫ్రెండ్స్‌కే రిక్వెస్ట్ పంపి వారితో త‌న భ‌ర్త మంచివాడు కాద‌న్న‌ట్టుగా చాటింగ్ చేస్తున్నాడు. ఈ విష‌యం భ‌ర్త‌కు తెలియ‌డంతో త‌న భార్య‌ను పుట్టింటికి పంపేశాడు. ఆ యువతి తాను ఎవ్వ‌రితోనూ చాటింగ్ చేయ‌లేద‌ని.. త‌న ఫేస్‌బుక్ ఖాతా వాడ‌డం మానేసి చాలా రోజులు అయ్యింద‌ని భ‌ర్త‌కు, అత్తింటి వారికి చెప్పినా వారు వినిపించుకోలేదు.

 

చివ‌ర‌కు ఆమె అనుమానం వ‌చ్చి సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును ద‌ర్యాప్తు చేయ‌గా కిరణ్‌కుమార్‌రెడ్డి నిందితుడని తేలింది. ఇతడిపై మిర్యాలగూడ, కోదాడలోనూ కేసులున్నట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు బాధితులకు సమాచారం ఇచ్చారు. చివ‌ర‌కు పోలీసులు స‌ద‌రు యువ‌తి భ‌ర్త‌ను పిలిపించి అస‌లు విష‌యం చెప్ప‌గా.. ఆ భార్య‌, భ‌ర్త‌లు ఒక్క‌ట‌య్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news