ప్రపంచ వ్యాప్తంగా తన వికృత చర్యలతో ఎన్నో దేశాలకు శత్రువుగా మారిన డ్రాగన్ దేశం చైనా ఇప్పుడు తైవాన్‌పై యుద్ధానికి ( సైనిక దాడికి) దిగేందుకు రెడీ అవుతోన్నట్టు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే సరిహద్దులకు భారీ స్థాయిలో బలగాలను, ఆయుధాలను చైనా తరలించింది. ఈ యుద్ధం కోసం అత్యాధునిక హైపర్‌సోనిక్ డీఎఫ్-17 క్షిపణుల్ని మోహరించినట్లు అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు చెపుతున్నారు. ఈ పరిణామాలతో ప్రపంచ వ్యాప్తంగా ఒక్కటే టెన్షన్ నెలకొంది.
అలాగే చైనా సరిహద్దుల్లోని ఫుజియాన్ – గ్వాన్‌డాంగ్‌లోని రాకెట్ ఫోర్స్, మెరైన్ కార్ప్స్ స్థావరాల్ని సైతం విస్తరించినట్లు కెనడాకు చెందిన కన్వాడిఫెన్స్ రివ్యూ తీసిన ఉపగ్రహ చిత్రాలు చెపుతున్నాయట. తూర్పు, దక్షిణ థియేటర్లలోని క్షిపణి స్థావరాలను గత కొన్నేళ్లలో రెండింతలకు పెంచినట్టు కూడా ఆ ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే చైనా తైవాన్‌పై సైనిక దాడికి నిదర్శనం అన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
ఇటీవల చైనా తైవాన్ సరిహద్దుల్లో సైనిక విన్యాసాలను విస్తరించడంతో పాటు డ్రాగన్‌కు చెందిన 40 యుద్ధ విమానాలు సైతం ఇరు దేశాల మధ్య రేఖను దాటి ముందుకు వెళ్లాయి. ఇటీవల సరిహద్దుల్లోని ఓ సైనిక స్థావరాన్ని సందర్శించిన అధ్యక్షుడు సీ జిన్‌పింగ్ సైతం సైనికులు యుద్ధానికి రెడీగా ఉండాలని చెప్పారు. ఇక ఇప్పటికే చైనా-అమెరికా మధ్య సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో తైవాన్‌కు మద్దతుగా అమెరికా దక్షిణ చైనా సముద్రంలో మోహరిస్తోంది. ఇక తైవాన్‌కు భారీ స్థాయిలో ఆయుధాలు, డ్రోన్ల వంటి అత్యాధుని సామగ్రిని సైతం సమకూరుస్తోంది.