కోర్టుల నుంచి వరుస షాకులతో ఉక్కిరి బిక్కిరి అవుతోన్న ఏపీ సీఎం జగన్‌కు మరో షాక్ తగిలింది. ఆయన్ను సీఎం పదవి నుంచి తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. జస్టిస్ ఎన్వీ. రమణపై ఆరోపణలు చేస్తూ జగన్ లేఖను విడుదల చేయడంపై న్యాయవాదులు జి.ఎస్. మణి, ప్రదీప్‌కుమార్ యాదవ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఎం జగన్‌పై దాదాపు 30 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. మనీ లాండరింగ్ కేసు కూడా ఉందని వారు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు.
అలాగే జగన్‌పై ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు న్యాయవ్యవస్థపై జోక్యం చేసుకునే ప్రయత్నాలు మానుకోవాలని కూడా వార్నింగ్ ఇచ్చింది. న్యాయ వ్యవస్థను కించపరిచేలా, బురదజల్లేలా జగన్ లేఖ ఉందని కూడా అసోసియేషన్ ఫైర్ అయ్యింది. మచ్చలేని రమణపై ఆరోపణలు చేయడం తగదని.. ఆయన ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేశారని.. ఆయన నిబద్ధత కల న్యాయమూర్తి అని వారు చెప్పారు.
రాజ్యాంగ వ్యవస్థలపై జగన్ దాడి చేయడం దురదృష్టకరమని, ఇది న్యాయవ్యవస్థ స్వయం ప్రతిపత్తిపై దాడి చేయడమేనని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.