వైసీపీ ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజు ఈ రోజు ఢిల్లీలో దీక్షకు కూర్చొన్న సంగతి తెలిసిందే. ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులకు నిరసనగా ఆయన గాంధేయ పద్దతిలో 8 గంటల పాటు దీక్ష చేపట్టారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. ఆయన ఢిల్లీలోని తన నివాసంలో స్వయంగా దీక్షకు దిగారు. ఆలయాలపై దాడులకు పాల్పడుతోన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
దేవాలయాల పరిరక్షణ కోసం చేపడుతున్న ఈ దీక్షా కార్యక్రమానికి కుల, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ నైతిక మద్దతు ఇవ్వాలని ఎంపీ రఘురామ కోరారు. అయితే ఈ దీక్షకు టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ మద్దతు పలికారు. వైసీపీ ఎంపీ రఘు దీక్షకు మద్దతుగా ఆయన కూడా కూర్చొన్నారు. ఇక ఈ దీక్షకు మరికొందరు ప్రముఖులు కూడా మద్దతు ఇచ్చారు. ఈ దీక్షపై ఇప్పుడు ఢిల్లీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.