కరోనా మహమ్మారి రాజకీయ నాయకుల కుటుంబాలను అస్సలు వదలడం లేదు. ఏపీ, తెలంగాణలో పలువురు రాజకీయ నాయకులు కరోనా భారీన పడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ టీడీపీ ఎమ్మెల్సీ కుటుంబంలో ఏకంగా 11 మంది కరోనా భారీన పడ్డారు. ఆయనే విజయవాడ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. తనకు కొద్ది రోజుల క్రితమే కరోనా సోకిందని.. తాను హోం క్వారంటైన్‌లో ఉన్నానని చెప్పిన వెంకన్న ఏపీలో హెల్త్ ఎమర్జెన్సీ నెలకొందని అన్నారు. తన కుటుంబంలోనే ఏకంగా 11 మందికి కరోనా సోకిందన్నారు.
ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న తాను, తన కుటుంబమే వైద్యం చేయించుకునేందుకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నానని.. మరి సామన్యుల పరిస్థితి ఏమిటి ? అని వెంకన్న ప్రశ్నించారు. ప్రభుత్వం వారిని ఆదుకోవడంలో ఎందుకు చిన్నచూపు చూస్తుందని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను వేధించడంపై దృష్టి పెడుతుందే తప్పా.. కరోనా బాధితుల గురించి ఎంత మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు.
ఈ జోరు చూస్తుంటే భవిష్యత్తులో ఏపీ కరోనా కేసుల విషయంలో నెంబర్ వన్ స్థానానికి వెళ్లిపోతుందని… ప్రాణాలు కోల్పోయిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం అందించాలని వెంకన్న డిమాండ్ చేశారు. ఇక ప్రజలు కరోనా కోరల్లో చిక్కుకుని ఇంత ఆపదలో ఉంటే ప్రభుత్వం పన్నులు, ఛార్జీలు పెంచడం దారుణమని విమర్శించారు.