నా ప్రియ‌మైన భ‌ర్య‌తో సెల్ఫీ అంటూ న‌దిలోకి తోశాడు… కర్నూలు మ‌ర్డ‌ర్ ప్లాన్‌లో షాకింగ్ ట్విస్ట్‌

సెల్పీ పేరుతో భార్య‌ను న‌దిలోకి తోసేసి చంపాల‌నుకున్న ఓ వ్య‌క్తికి షాకింగ్ ట్విస్ట్ ఎదురైంది. హైద‌రాబాద్‌లో అనాథ‌గా ఉన్న రామ‌ల‌క్ష్మి బ్యూటీ పార్ల‌ర్ నిర్వ‌హిస్తోంది. ఆమెకు అక్కడే హోం గార్డుగా ఉన్న ప‌త్తి భాస్క‌ర్‌తో ఏర్ప‌డిన ప‌రిచ‌యం కాస్తా ప్రేమ‌గా మారింది. 2016లో వీరు పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ల పాటు భార్య‌ను ప్రేమగా చూసుకున్న భాస్క‌ర్ ఆ త‌ర్వాత ఆమెను వ‌దిలించుకోవాల‌ని ప్లాన్ చేసుకున్నాడు. ఈ క్ర‌మంలోనే ఈ నెల 16న క‌ర్నూలు జిల్లాలో త‌న స్వ‌గ్రామం అయిన మ‌ర్రిప‌ల్లెకు భార్య‌ను తీసుకువ‌చ్చిన భాస్క‌ర్ సోమ‌వారం బంధువుల ఇంటికి వెళ‌దామ‌ని భార్య‌ను ఒప్పించి బైక్‌పై బ‌య‌లు దేరారు.

 

కుందూ నది వంతెన వద్దకు చేరుకున్న తర్వాత అక్కడ బైక్ ఆపి సెల్ఫీ తీసుకుందామ‌ని భార్య‌ను న‌మ్మించి న‌దిలోకి తోసేశాడు. అనుమానం రాకుండా ఉండేందుకు తాను కూడా బైక్‌తో స‌హా న‌దిలోకి దూకేశాడు. త‌న‌కు ఈత రావ‌డంతో ఒడ్డుకు చేరుకున్నాడు. రామ‌ల‌క్ష్మి చ‌నిపోయింద‌నుకుని ఇంటికి వ‌చ్చేశాడు. అయితే ఆమె ప్ర‌వాహంలో కొట్టుకు పోవ‌డం గ‌మ‌నించి కొంద‌రు రైతులు ఆమెను కాపాడి ఉయ్యాలవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది.

 

ఈ విష‌యం తెలుసుకున్న పోలీసులు బాధితురాలి నుంచి వివ‌రాలు సేక‌రించ‌డంతో పాటు ఆమె ఫిర్యాదు మేరకు భాస్కర్‌పై హత్యాయత్నంతో పాటు పలు కేసులు నమోదు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని… బాధితురాలికి న్యాయం చేస్తామని వెల్లడించారు.

Leave a comment