ఏపీలో కరోనా వ్యాప్తి రోజు రోజుకు మరింత తీవ్రమవుతోంది. పెరుగుతోన్న కేసులతో ప్రభుత్వం, అటు ప్రజాప్రతినిధులు సైతం హడలిపోతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా పోలీసులు, ప్రజా ప్రతినిధులు కరోనా భారీన పడుతున్నారు. వీరిలో రోగ నిరోధశక్తి తక్కువుగా ఉన్న వారు ఇతర అనారోగ్యాలు ఉన్న వారు కరోనాకు బలికాక తప్పని పరిస్థితి. ఏపీలో ఇప్పటికే 15 మందికి పైగా ఎమ్మెల్యేలు కరోనా భారీన పడ్డారు. ఇక ముగ్గురు వైసీసీ ఎంపీలకు కూడా కరోనా వచ్చిన సంగతి తెలిసిందే.
ఇక మంత్రులకు కూడా కరోనా సోకింది. ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఇప్పటికే కరోనా రాగా ఆయన కోలుకున్నారు. తాజాగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ సైతం కరోనా భారీన పడ్డారు. ఆయనతో పాటు ఆయన తనయుడు వెంకట శివసాయి నందీష్‌కి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. గత అర్ధరాత్రి దాటాక మంత్రి కార్యాలయం ఇందుకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది.
ప్రస్తుతం వీరిద్దరు వైద్యుల సలహా మేరకు హోం క్వారంటైన్‌లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఇక ఇటీవల తనను కలిసిన వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచించారు. ఇక నిన్నటి వరకు ఆయనతోనే కలిసి జిల్లాలో పర్యటించిన వైసీపీ నేతలు అందరూ కూడా టెన్షన్ టెన్షన్‌తోనే ఉంటున్నారు.