తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అత్యంత ఆప్తుడు, కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ బొమ్మర వెంకటేశం కరోనాతో మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం ఆయనకు కరోనా రావడంతో ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ హాస్పటల్లో చేర్పించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన ఈ రోజు మృతి చెందారు. వెంకటేశం కేసీఆర్‌కు చిన్ననాటి ఆప్తుడు. చిన్నప్పుడు వీరిద్దరు స్నేహితులు. ఆయన దుబ్బాక నియోజకవర్గానికి చెందిన వారు.
వెంకటేశంకు భార్య విజయ, నలుగురు కొడుకులు నాగభూషణం, శ్రీనివాస్, రాజేందర్, ప్రసాద్ ఉన్నారు. వెంకటేశం రైస్ మిల్ అసోసియేషన్ సెక్రటరీగా, చల్లాపూర్ గ్రామ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా, రేకులకుంట మల్లికార్జున స్వామి దేవస్థానం పాలకమండలిలో సభ్యుడిగా పని చేశారు. ప్రస్తుతం కాళేశ్వర దేవస్థానం చైర్మన్ గా కొనసాగుతున్నారు. కేసీఆర్ రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగారు.
కేసీఆర్ సీఎం అయ్యాక ఆయనకు ఏ పదవులు కావాలో కోరుకోమని చెప్పారు. ఆయన మాత్రం తనకు ఏ పదవి వద్దని.. ఈ వయస్సులో తనకు కాళేశ్వరం దేవస్థానం చైర్మన్ పదవి ఇస్తే చాలని ఆ దేవుడికి సేవ చేసుకుంటానని కోరారు. కేసీఆర్ ఆయన కోరిక తీర్చేశారు. ఆయన ఆ పదవిలో ఉండగానే మృతిచెందారు.