దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలతో కూడిన మార్గదర్శకాలు జారీ చేసింది. వైరస్ నుంచి కోలుకున్నాక కూడా కొందరిలో అలసట కొద్ది రోజుల పాటు ఉంటుందట. అలాగే ఒళ్లునొప్పులు, దగ్గు, జలుబు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడక తప్పదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతోన్న వారు కోలుకునేందుకు కాస్త ఎక్కువ సమయం పడుతుందని కూడా స్పష్టం చేసింది.
ఇక కరోనా నుంచి కోలుకున్న ప్రతి ఒక్కరు అలసత్వం లేకుండా వ్యాయామం చేయాలని, వ్యాధి నిరోధక శక్తి పెంచుకునే ఆహారం తీసుకోవాలని కూడా చెప్పింది. గుండె పని తీరు, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను తరచూ పరీక్షించుకోవాలని చెప్పింది. ఇక ఎప్పటికప్పుడు గోరు వెచ్చని నీళ్లు తాగడంతో పాటు శానిటైజర్లు, మాస్క్ తప్పనిసరి అని పేర్కొంది. వీటితో పాటు భౌతిక దూరం పాటించాలి.
ఇక ఇంట్లో ఐసోలేషన్లో ఉన్న వాళ్లు జర్వం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, భరించలేని గుండె నొప్పి లక్షణాలు కనిపిస్తే ముందే గుర్తించి వైద్యులను సంప్రదించాలని కూడా పేర్కొంది.