మనిషన్నాక కళా పోషణ.. రాజకీయ నేత అన్నాక వ్యూహం లేకపోతే.. ఎందకూ పనికిరాకుండా పోతారని అంటారు రాజకీయ పండితులు. ఇలాంటి వ్యూహంలో దిట్టగా.. ప్రత్యర్థులు సైతం ముక్కున వేలేసుకునేలా వ్యవహరించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే.. ఆయన ఒక్క చంద్రబాబే!బాబంటే వ్యూహం.. వ్యూహం అంటే బాబే! అనే రేంజ్‌లో ఆయన చేసిన రాజకీయాలు అన్నీ ఇన్నీ కావు. ఎలాంటి పరిస్థితి వచ్చినా.. దానిని పాజిటివ్ కోణంలో మార్చుకోవడంలో దిట్టమైన నాయకుడిగా చంద్రబాబు పేరు తెచ్చుకున్నారు. ఆయన వ్యూహాలకు అందరూ అచ్చరువొందేవారే తప్ప.. ఎవరూ నొచ్చుకునేవారు కారు.
ఈ సందర్భంగా 2014-2019 మధ్య చంద్రబాబు చేసిన వ్యూహ చతురత, రాజకీయంగా ఆయన వేసిన అడుగులు నభూతో అన్న విధంగా సాగాయి. రాజదానిగా అమరావతి ఎంపిక, కాపుల ఉద్యమంపై చంద్రబాబు ముద్ర వంటివి ప్రధానంగా చెప్పుకోవాలి. నిజానికి రాజధానిగా అమరావతిని ఎంపిక చేయాలని శివరామకృష్ణ కమిటీ చెప్పలేదు. అయినాకూడా రాష్ట్రం మొత్తానికి నడిబొడ్డు వంటి అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నాక.. చంద్రబాబు దానిని ప్రచారం చేసుకున్న తీరు ప్రత్యర్థి పార్టీ గా ఉన్న వైసీపీలోని చాలా మంది నాయకులను ముక్కున వేలేసుకునేలా చేసింది.
చాలా మంది నాయకులు ఈ విషయంలో బాబు వ్యూహాన్ని అనుసరించారే తప్ప.. ఇప్పటికీ వ్యతిరేకించేవారు తక్కువనే చెప్పాలి. ఇక, కాపుల ఉద్యమం తారస్థాయికి చేరిపోయి.. ఇక, కాపులు కొంప కూల్చేస్తారు! అనే వరకు టాక్ వినిపించినప్పుడు కూడా చంద్రబాబు అదరలేదు.. బెదరలేదు. 2018లో కాపులకు అనుకూలంగా అసెంబ్లీలో 5శాతం రిజర్వేషన్‌లపై తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. అంటే.. బాబు కాపులకు సానుకూలం అనే టాక్ వచ్చేలా చేయగలిగారు. కాపుల్లో అప్పటి వరకు కొందరు బాబును వ్యతిరేకించినా.. అంతెందుకు కాపు ఉద్యమ మాజీ నాయకుడు ముద్రగడ పద్మనాభం వంటివారు కూడా బాబు వ్యూహానికి ఫిదా అయ్యారు.
సరే! అలాగైనా మాకు న్యాయం చేయండి అనే శారంటే.. బాబు వ్యూహం ఎలాంటిదో చెప్పుకోవచ్చు. అయితే, ఇది కేంద్రం పాస్ చేయలేదు. దీంతో మళ్లీ కాపులు ఫైర్ అయ్యేందుకు రెడీ అయ్యారు. అంతే! బాబు మరో పాచిక వేశారు. కేంద్రం అగ్రవర్ణ పేదలకు ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్‌లో గుండుగుత్తుగా 5శాతం కాపులకు ఇచ్చేశారు. దీంతో భళా చంద్రబాబు! అనే టాక్ రాష్ట్ర వ్యాప్తంగా వినిపించడం గమనార్హం. ఇలాంటి అనేక మెరుపులు చంద్రబాబు జీవితంలో అనేకం ఉన్నాయనడంలో సందేహం లేదు.