ఏపీలో జగన్ సర్కార్‌కు వరుసగా షాకులు తగులుతున్నాయి. ఈ షాకుల పరంపరకు బ్రేకుల్లేకుండా పోయాయి. తాజాగా సుప్రీంకోర్టులో మరోసారి ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో ఇంగ్లీష్ మీడియం అమలుపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ క్రమంలోనే ప్రతివాదులకు సైతం సుప్రీం నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది.
ఏపీలో ఇంగ్లీష్ మీడియం అమలుపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ కేసులు జగన్ ప్రభుత్వం తరపున న్యాయవాది మాట్లాడుతూ హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరారు. మాతృభాషలోనే విద్యాభోధన జరగాలన్న నిబంధన ఏదీ చట్టంలో లేదని చెప్పారు. ఇంగ్లీష్ మీడియంలో విద్యాభోధన జరగాలన్న ప్రభుత్వ నిర్ణయం ప్రగతిశీలమని న్యాయవాది విశ్వనాథన్ వాదించారు. తెలుగు మీడియంలో బోధన వల్ల ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలు రావడం లేదని కూడా ఆయన తెలిపారు.
దీనిపై ప్రతివాదుల తరపున న్యాయవాది శంకర్ నారాయణ వాదిస్తూ ఈ నిర్ణయంతో విద్యార్థులు తెలుగులో చదవాలన్న అవకాశాన్ని కోల్పోతున్నారని చెప్పార. ప్రభుత్వ నిర్ణయం వల్ల తెలుగు మీడియం పాఠశాలలు పూర్తిగా కనుమరుగు అవుతాయన్నారు. అయితే దీనిపై సుప్రీం జస్టిస్ చంద్రచూడ్ మాతృభాషలో బోధన జరిగే అవకాశం ఉన్నప్పుడు ఇంగ్లీష్‌లో బోధించాల్సిన అవసరం ఏంటని కూడా ప్రశ్నించారు. చివరకు ఇరువురు వాదనలు విన్న కోర్టు విచారణ ఈ నెల 25కు వాయిదా వేసింది. ఏదేమైనా తాజా తీర్పుతో జగన్ సర్కార్‌కు మరోసారి సుప్రీం కోర్టులో చుక్కెదురు అయినట్టయ్యింది.