గంటా శ్రీనివాసరావు…గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో బాగా హైలైట్ అవుతున్న పేరు. ఈయన అతి త్వరలోనే టీడీపీని వీడి జగన్‌కు మద్ధతు ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే గంటాని వైసీపీలోకి రాకుండా అడ్డుకునేందుకు మంత్రి అవంతి శ్రీనివాస్ ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి గంటా పార్టీ మారిపోతారని వార్తలు వస్తున్నాయి.
కొన్నిసార్లు వైసీపీలోకి వెళ్తారని వస్తే, మరికొన్నిసార్లు బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయన ఎటు వెళ్లకుండా టీడీపీలోనే ఉంటున్నాని చాలాసార్లు ప్రకటించారు. ఇదే సమయంలో గంటాని వైసీపీలోకి రానిచ్చే ప్రసక్తి లేదని మంత్రి అవంతి, ఎంపీ విజయసాయిరెడ్డిలు పలుమార్లు బహిరంగంగానే చెప్పారు. దీంతో గంటా వైసీపీలోకి వెళ్ళేందుకు ఛాన్స్ లేదని అంతా అనుకున్నారు.కానీ గంటా ఊహించని విధంగా వైసీపీలో ఉండే తన సన్నిహితుల ద్వారా లాబీయింగ్ చేసి, జగన్ దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారు. రేపో మాపో గంటా వైసీపీ వెళ్లడం ఖాయమైపోయింది.
ఇదే సమయంలో గంటా టీడీపీని వీడితే విశాఖ నార్త్‌లో ఆ పార్టీలోకి బీజేపీకి చెందిన బడా నాయకుడుని తీసుకోచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. 2014లో టీడీపీతో పొత్తు ద్వారా విశాఖ నార్త్ నుంచి గెలిచిన బీజేపీ నేత విష్ణు కుమార్ రాజుని పార్టీలోకి తీసుకొస్తే బాగుంటుందని తమ్ముళ్ళు అభిప్రాయపడుతున్నారు. నార్త్‌లో పార్టీలకు అతీతంగా విష్ణుకు ఫాలోయింగ్ ఉంది. పైగా ఇక్కడ టీడీపీకి మంచి పట్టుంది.
కాబట్టి గంటా వెళ్ళగానే రాజుగారుని లైన్‌లోకి తీసుకొస్తే, నార్త్‌లో టీడీపీ పట్టు కోల్పోదని తమ్ముళ్ళు భావిస్తున్నారు. పైగా గంటా పార్టీని వీడినా, పెద్దగా నష్టం జరగదని అంటున్నారు. ఇక విష్ణుకుమార్ రాజు సైతం ఎమ్మెల్యేగా, బీజేపీ నుంచి విప్‌గా ఉన్నప్పుడు చంద్రబాబుకు సానుకూలంగా వ్యవహరించారు. ఇక ఇప్పుడు చంద్రబాబు సైతం విష్ణును పార్టీలోకి తీసుకునే విషయంలో సానుకూలంగానే ఉన్నారట.