నెల్లూరు జిల్లా అధికార వైసీపీకి కంచుకోట. గతంలో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న నెల్లూరు…2014 తర్వాత నుంచి వైసీపీకి అండగా నిలుస్తూ వస్తుంది. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో పసుపు గాలి ఉన్నా సరే…జిల్లాలో మెజారిటీ సీట్లు వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. జిల్లాలో ఉన్న 10 సీట్లలో వైసీపీ 7 గెలిస్తే, టీడీపీ 3 సీట్లు గెలుచుకుంది. ఇక 2019 ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొత్తం జిల్లాలో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. టీడీపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. పైగా వైసీపీ అధికారంలోకి రావడంతో జిల్లాలో టీడీపీ పుంజుకునే పరిస్థితి లేకుండా పోతుంది. అయితే ఇంత కష్టకాలంలో కూడా ఇద్దరు తెలుగు తమ్ముళ్ళు టీడీపీని నిలబెట్టడానికి కష్టపడుతున్నారు. వైసీపీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో సత్తా చాటాలని చూస్తున్నారు.
అలా వైసీపీ కంచుకోటల్లో సత్తా చాటాలని చూస్తున్న నాయకులు ఎవరో కాదు…నెల్లూరు సిటీ ఇన్‌ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్‌ఛార్జ్ అబ్దుల్ అజీజ్. 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్…మాజీ మంత్రి నారాయణపై కేవలం 2 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే ఓడిపోయాక నారాయణ ఏపీ రాజకీయాల్లో కనిపించలేదు. దీంతో సిటిలో పార్టీని నిలబెట్టడానికి చంద్రబాబు…కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని బరిలోకి దించారు. ఇన్‌ఛార్జ్‌గా వచ్చిన దగ్గర నుంచి కోటంరెడ్డి దూకుడుగా పనిచేస్తున్నారు. కేవలం తన నియోజకవర్గంలోనే పార్టీని బలోపేతం చేసుకోవడమే కాకుండా…జిల్లాలోని ఇతర సమస్యలపై కూడా పోరాటం చేస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో సిటిలో టీడీపీ జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు.
అటు రూరల్‌లో అజీజ్ కూడా సత్తా చాటుతున్నారు. మామూలుగా రూరల్‌లో టీడీపీకి అంత పట్టు లేదు. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం రూరల్ టిక్కెట్ దక్కించుకున్న ఆదాల ప్రభాకర్…సడన్‌గా వైసీపీలోకి వెళ్లిపోవడంతో, చంద్రబాబు..అజీజ్‌ని బరిలోకి దించారు. చివరి నిమిషంలో టిక్కెట్ దక్కించుకున్నా సరే అజీజ్…వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి గట్టి పోటీనే ఇచ్చారు. ఓడిపోయినా సరే నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా, పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలని ఎండగడుతూ…ప్రజల మద్ధతు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తానికైతే వైసీపీ కంచుకోటల్లో ఈ ఇద్దరు తమ్ముళ్ళు దూకుడు ప్రదర్శిస్తున్నారనే చెప్పొచ్చు.