ఏపీలో పేదలకు ఉచిత ఇళ్ల స్థలాల పంపిణీలో వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్రమైన అవినీతికి పాల్పడుతున్నారని ప్రతిపక్ష టీడీపీ నేతల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే దీనిపై విచారణ జరపాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో 600 ఎకరాల ఆవ భూములను ఇళ్ల పట్టాల కింద సేకరించారని.. అక్కడ ఎకరం రు. 45 లక్షల చోప్పున రు. 270 కోట్లు ఖర్చు చేశారని.. అక్కడే భారీ ఎత్తున అవినీతి జరిగిందని బాబు ఆరోపించారు.
ఇక కృష్ణా జిల్లాలో పెనమలూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి కొలుసు పార్థసారథి సైతం ఇళ్ల స్థలాల పేరుతో ఏకంగా రు. 50 కోట్ల అవినీతికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే బోడు ప్రసాద్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల పేరుతో రు. 50 కోట్ల అవినీతి జరుగుతోందని… ఇక వైసీపీ వాళ్లకే ఇళ్ల స్థలాలు ఇస్తున్నారంటూ ప్రసాద్ మరిన్ని ఆరోపణలు కూడా చేశారు. ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాల పంపిణీలో వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలపై భారీ ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.