ప్రముఖ గాయకుడు ఎస్పీ. బాల సుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో ఇంకా వెంటిలేటర్ మీదే చికిత్స పొందుతున్నారు. కరోనా భారీన పడిన ఆయన ఆరోగ్యం రోజు రోజుకు విషమిస్తోంది. గత పది రోజులుగా ఆయన చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్నా పరిస్థితిలో ఎంత మాత్రం మార్పు రాలేదంటున్నారు. ఇక శనివారం సాయంత్రం రిలీజ్ అయిన హెల్త్ బులిటెన్ ప్రకారం చూస్తే బాలు కరోనా నుంచి కోలుకునేందుకు ప్లాస్మా చికిత్స అందిస్తున్నారని చెప్పారు.
గత మూడు రోజులుగా కూడా బాలు వెంటిలేటర్‌పైనే చికిత్స తీసుకుంటున్నారు. ఇక శనివారం తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి విజయ భాస్కర్ ఎస్పీబీని పరామర్శించారు. ఆయనకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఆయన వైద్యానికి అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి విజయభాస్కర్ చెప్పారు. మరోవైపు ఆయనకు వైద్యం అందించేందుకు అంతర్జాతీయ నిపుణుల సహకారం తీసుకుంటున్నట్టు కూడా వైద్యులు చెపుతున్నారు.