రాజస్థాన్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి అశోక్ గహ్లాత్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. పాలక కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఈ విశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో మూజువాణి ఓటింగ్‌తో గహ్లాత్ సర్కార్ నెగ్గింది. ఈ విశ్వాస పరీక్షపై ఓటింగ్ నెగ్గిన అనంతరం సభను ఈ నెల 21 వరకు వాయిదా వేశారు. తిరుగుబాటు నేత సచిన్ పైలట్ పార్టీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకలతో భేటీ అనంతరం తిరిగి పార్టీ గూటికి చేరారు.
ఇక సచిన్ వర్గం కూడా గహ్లాత్‌కు అనుకూలంగా ఓటు వేయడంతో గహ్లాత్ సులభంగానే విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. మధ్యప్రదేశ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో ధనం, అధికార బలం ప్రయోగించి ప్రభుత్వాలను కూల్చిన బీజేపీ ఇక్కడ విఫలమైందని కాంగ్రెస్ విమర్శలు చేసింది. 200 మంది సభ్యులు కలిగిన రాజస్తాన్ అసెంబ్లీలో గహ్లోత్ సర్కార్‌కు 107 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా, బీజేపీ సంఖ్యాబలం 72గా ఉంది.