కరోనా వైరస్ పుట్టిన చైనాలో మరో కొత్త వైరస్ వ్యాప్తి అందరిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. తాజా వైరస్ పశువుల గోమారి నుంచి మనుషులకు సోకుతుందని వెల్లడైంది. ఈ కొత్త వైరస్ వల్ల ఇప్పటికే అక్కడ ఈస్ట్, వెస్ట్ ప్రావిన్స్‌లలో ఏడుగురు చనిపోయినట్టు తెలుస్తోంది. ఇది కొత్త వైరస్ ఇప్పుడు పుట్టింది కాదని… బన్యావైరస్ కేటగిరీలోకి వచ్చే ఫెల్బో వైరస్ కు చెందిన కొత్త స్ట్రెయిన్ (రకం) మాత్రమే అని సైంటిస్టులు చెప్తున్నారు. ఇది పశువుల శరీరానికి పట్టుకుని.. రక్తాన్ని పీల్చే నల్లి వైరస్ ద్వారా మనుష్యులకు వ్యాప్తి చెందుతుందని అంటున్నారు.
ఈ వైరస్ వల్ల సివియర్ ఫీవర్ విత్ త్రాంబోసైటోపీనియా సిండ్రోమ్ (ఎస్ఎఫ్ టీఎస్) వ్యాధి వస్తుందట.. అందుకే దీనిని ఎస్ఎఫ్ టీఎస్ వైరస్ అని పిలుస్తున్నట్టు శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ఈవైరస్ సోకిన పేషేంట్లలో డెత్ రేటు 1 నుంచి 5 శాతం ఉంటుందని, ముఖ్యంగా వయసు పైబడినవాళ్లకు రిస్క్ ఎక్కువని చెప్తున్నారు. దీనికి కూడా ప్రత్యేకమైన వ్యాక్సిన్ లేదని.. చికిత్సతోనే తగ్గిపోతుందని చెపుతున్నారు. అయితే వ్యాధి ముదిరితే మాత్రం ప్రాణానికే ప్రమాదం అట.
ఇక ఈ వ్యాధి లక్షణాలు చూస్తే తొలిదశలో జ్వరం, అలసట, చర్మంపై దద్దుర్లు , దగ్గు , తలనొప్పి, అలసట వస్తాయి. తర్వాత వ్యాధి తీవ్రమైతే ఫీవర్, ప్లేట్ లెట్లు , తెల్ల రక్తకణాల సంఖ్య తగ్గడం, కడుపు, పేగు సమస్యల వంటి సింప్టమ్స్ కన్పిస్తాయి. కొంతమందిలో కండరాలు, నాడీ సమస్యలు, రక్తం ఎక్కువగా కారడం లేదా ఎక్కువగా గడ్డకట్టడం వంటి సింప్టమ్స్ కూడా ఉంటాయని అంటున్నారు.