భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ ఎంఎస్. ధోనీ క్రికెట్ నుంచి రిటైరయ్యాడు. ఈ విషయాన్ని శనివారం తన ఇన్‌స్టా గ్రామ్ ద్వారా ప్రకటించి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇదిలా ఉంటే ధోనీ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇప్పుడు ఏం చేస్తాడనేదానిపై చర్చ నడుస్తోంది. ధోనీ రిటైర్మెంట్ తర్వాత తాను ఏం చేయాలనే దానిపై బాల్యంలోనే ప్లాన్ చేసుకున్నాడట. ధోనీ రాంచీలో కేవలం ఇంటర్మీడియట్ వరకు మాత్రమే చదువుకున్నాడు.
ఆ తర్వాత క్రికెట్ మాయలో పడి చదువుకు దూరం అయ్యాడు. ఆ తర్వాత క్రికెట్లో రాణించడంతో ఎలాగైనా డిగ్రీ చదవాలన్న కోరికతో 2008లో రాంచీలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో వొకేషనల్ స్టడీస్ అయిన ఆఫీస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సెక్రటేరియల్ ప్రాక్టీస్ కోర్సులో బ్యాచిలర్ డిగ్రీలో చేరాడు. అయితే క్రికెట్‌పై కాన్‌సంట్రేషన్ చేయడంతో ఆరు సెమిస్టర్లలో ఒక్క దాంట్లో కూడా ఉత్తీర్ణుడు కాలేదు. ఇప్పుడు ఈ సబ్జెక్టులు అన్నింటిని కంప్లీట్ చేయాలనుకుంటున్నాడట.
ఇక ధోనీ స్టడీస్‌లో అంత గొప్పేం కాదు… టెన్త్‌లో 66 శాతం, ఇంటర్‌లో 56 శాతం మార్కులు మాత్రమే సాధించానని గతంలో ఓ సారి తెలిపారు. 2011 నవంబరులో ధోనీకి ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా లభించింది. భవిష్యత్తులో ఈ బాధ్యతను నెరవేర్చడానికి తాను పూర్తిగా సిద్ధంగా ఉన్నానని ధోనీ తెలిపారు. తద్వారా ఆర్మీలో పనిచేయాలన్న తన కల నెరవేరుతుందన్నారు. ఏదేమైనా ధోనీ ఆర్మీలో కొంత కాలం పాటు తన సేవలు అందించనున్నాడు.