కరోనా ప్రపంచంలో ఎవ్వరిని వదలడం లేదు. దేశవ్యాప్తంగా ఇప్పటికే కరోనా ఎంతో మంది ప్రముఖులకు సోకింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలకు చెందిన 20 మంది ఎమ్మెల్యేలకు పైగా కరోనా సోకింది. తాజాగా ఇప్పుడు కరోనా ఓ మంత్రితో పాటు ఆయన ఇద్దరు కుమార్తెలకు కూడా సోకింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి సుఖ్ రాం చౌదరితోపాటు అతని ఇద్దరు కుమార్తెలకు కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది. దీంతో వీరి కుటుంబంలో వారంతా హోం ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు.
మంత్రి వ్యక్తిగత సహాయకుడికి కూడా కరోనా సోకడంతో మంత్రి కరోనా పరీక్షలు చేయించుకోగా ఆయనకు కోవిడ్ ఉందని తేలింది. ఆ తర్వాత మంత్రి సుఖ్ రాం చౌదరి కుమార్తెలకు కూడా కోవిడ్ ఉందని తేలింది. దీంతో మంత్రి సుఖ్ రాంను సిమ్లాలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి, మంత్రి ఇద్దరు కుమార్తెలను సిమ్లాలోని కొవిడ్ కేర్ సెంటరుకు తరలించి చికిత్స చేస్తున్నారు.
ఇదిలా ఉంటే మంత్రి సుఖ్ రాం చౌదరి త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి జైరాంఠాకూర్ ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. కరోనా సోకిన మంత్రిని గతంలో కలిసిన ఎమ్మెల్యే పొంతా సాహిబ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. హిమాచల్ ప్రదేశ్ లో 131 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. హిమాచల్ లో 1965 మందికి కరోనా సోకగా, వారిలో 13 మంది మరణించారు.