అక్క‌డ టీడీపీ బ్ర‌ద‌ర్స్‌కు ప‌ట్టు దొరికేసిందే… వైసీపీకి చుక్క‌లే…!

అనంతపురం జిల్లా రాజకీయాల్లో జేసీ ఫ్యామిలీకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. దశాబ్దాల తరబడి అనంత రాజకీయాల్లో జేసీ దివాకర్ రెడ్డి చక్రం తిప్పడంతో, జిల్లాపై ఆ ఫ్యామిలీకి గట్టి పట్టుంది. ముఖ్యంగా తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ఫ్యామిలీకి తిరుగులేదు. జేసీ దివాకర్ 1985 నుంచి 2009 వరకు తాడిపత్రి నుంచి వరుసగా 6 సార్లు కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.

 

అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో టీడీపీలోకి వచ్చేసి, జేసీ దివాకర్ అనంతపురం ఎంపీగా, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ తాడిపత్రి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఇక 2019 ఎన్నిలకొచ్చేసరికి జేసీ బ్రదర్స్ పోటీ నుంచి తప్పుకుని తనయులని బరిలో దించారు. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ తనయుడు పవన్ రెడ్డి పోటీ చేయగా, తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ తనయుడు అస్మిత్ రెడ్డిలు పోటీ చేశారు. అయితే జగన్ గాలిలో ఇద్దరు ఓటమి పాలయ్యారు.

 

పైగా తొలిసారి తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీ ఓటమి పాలైంది. ఇక ఎన్నికలై ఏడాది దాటేసింది. అటు అనంతపురం వైసీపీ ఎంపీ, తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు పెద్దగా ఏమి బాగోలేదు. దీనికి తోడు జగన్ ప్రభుత్వం కక్షగట్టి ప్రభాకర్, అస్మిత్‌లని జైలుకు పంపారనే సానుభూతి పెరిగింది. వారు జైలునుంచి తిరిగొచ్చినా..మళ్ళీ ప్రభాకర్‌పై మరో కేసు పెట్టి జైలుకు పంపారు. ఇక ఈ పరిణామాల నేపథ్యంలో అనంత రాజకీయాలపై జేసీ ఫ్యామిలీ పట్టు తెచ్చుకున్నట్లు కనిపిస్తోంది.

 

అనంతపురం పార్లమెంట్ పరిధిలో పవన్‌కు ఫుల్ గ్రిప్ దొరకగా, తాడిపత్రిలో మళ్ళీ జేసీ ఫ్యామిలీకి సపోర్ట్ పెరిగింది. ఈ నాలుగేళ్ళు కాస్త ఇబ్బంది పడినా…నెక్స్ట్ ఎన్నికల్లో మాత్రం జేసీ వారసులకు మంచి విజయాలు దక్కుతాయని అర్ధమవుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఓడినా ఈ యేడాది కాలంలో ఏ మాత్రం జ‌ర‌గ‌ని అభివృద్ధిపై నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటుండ‌డంతో పాటు జేసీ ఫ్యామిలీతో తాడిప‌త్రి అభివృద్ధి జ‌రుగుతుంద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. మొత్తానికైతే జేసీ ఫ్యామిలీ…అనంతలో వైసీపీకి చుక్కలు చూపించడం ఖాయంగా కనిపిస్తోంది.

Leave a comment