తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల రాజకీయం రంజుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కమల్ హాసన్ తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని తన పార్టీ కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. ఇప్పుడు కోలీవుడ్ ఇళయ దళపతి విజయ్ సైతం అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగనున్నారా ? అంటే రెండు రోజులుగా సోషల్ మీడియాలో అవుననే చర్చలు మొదలయ్యాయి. ఈ వార్తలతో విజయ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. వాస్తవంగా జయలలిత ఉన్నప్పటి నుంచే విజయ్ రాజకీయాల్లోకి వస్తాడన్న ప్రచారం ముమ్మరంగా జరిగేది.
అప్పట్లో విజయ్ సినిమా రిలీజ్ అవుతోందంటే ఏదో ఒక అడ్డంకి వచ్చేది. ప్రభుత్వమే కావాలని ఈ అడ్డంకులు క్రియేట్ చేస్తోందన్న విమర్శలు కూడా వచ్చేవి. జయ కూడా విజయ్ కంటే అజిత్‌కే ఎక్కువ ప్రయార్టీ ఇచ్చేవారు. ఇక ఇప్పుడు తమిళనాడులో ఉన్న రాజకీయ శూన్యతను ఆధారంగా చేసుకుని విజయ్ రాజకీయ రంగప్రవేశానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు తాజా సమాచారం. ఈ ఎన్నికల్లో విజయ్ పోటీ చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
విజయ్ తండ్రి , ప్రముఖ సినీ దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్ రంగంలోకి దిగినట్టు తెలిసింది. ఈయన కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో పార్టీ పేరును నమోదు చేసే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. అందులో భాగంగా ఢిల్లీకి చెందిన ఒక ప్రముఖ న్యాయవాదితో సంప్రదించినట్లు తెలిసింది.