గత పదిహేనేళ్లుగా హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ అప్ అండ్ డౌన్ అవుతూనే వస్తోంది. 2004 తర్వాత 2007 వరకు ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసిన రియల్ ఎస్టేట్ రంగం తర్వాత కాస్త స్లో అయ్యి మళ్లీ పుంజుకుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కాస్త తగ్గినట్టు కనపడినా.. ఆ తర్వాత మళ్లీ పుంజుకుంది. ఇక ఇటు ఏపీలో రాజకీయ పరిణామాలు కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునేందుకు కారణమైంది. అయితే ఆ తర్వాత కరోనా విజృంభించడంతో హైదరాబాద్ మార్కెట్ పూర్తిగా కుప్పకూలింది.
ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలడంతో ఈ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టిన నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా విరవిహారం చేసే ముందు వరకు హైదారబాద్‌లో రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీలో చదరపు అడుగుకు రు. 3 వేల నుంచి రు. 7 వేల వరకు ఉండేది. ఇక్కడ ఏరియాను బట్టి రేటు ఉండేది. అత్యధికంగా గచ్చిబౌలిలో రు. 7 వేలు ధర పలికింది. ఇక డబుల్ బెడ్ రూం ప్లాట్ రేటు కూడా రు. 35 లక్షలతో ప్రారంభమై రు. కోటి వరకు ఉంది.
కేపీహెచ్‌బీ, ప్రశాంతి నగర్ ఏరియాల్లో రు. 35 నుంచి రు.40 లక్షల వరకు రేటు ఉండేది. ఇక గచ్చిబౌలి లాంటి ఏరియాల్లో డబుల్ బెడ్ రూం ప్లాట్ల రేటు రూ.75 లక్షల నుంచి రూ.1 కోటి వరకు వెచ్చించాల్సిన పరిస్థితి ఉండేది. ఈ రేట్లు చూసి మధ్య తరగతి జనాలు సొంత ఇంటి కల వదిలేసుకున్నారు. ఇక ఇప్పుడు కరోనా దెబ్బకు రియల్ మార్కెట్ ఢమాల్ అంది. ఉద్యోగాలకు భద్రత లేకపోవడం.. చేస్తోన్న ఉద్యోగాలు ఎప్పటి వరకు ఉంటాయో తెలియకపోవడంతో ప్లాట్లు కొనేవారు తగ్గిపోతున్నారు. ఇప్పుడు జనాలు బతికితే చాలనుకుంటున్నారు. అందుకే కొనేవారు లేకపోవడంతో ఇప్పుడు రియల్టర్లు కూడా భారీగా రేట్లు తగ్గించేస్తున్నారు. దీంతో ఇక్కడ రియల్ రంగం కుప్పకూలింది.