విజయవాడలోని రమేష్ ఆసుపత్రి కోవిడ్ కేర్‌గా ఉన్న స్వర్ణ ప్యాలెస్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఏకంగా 10 మంది వరకు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆసుపత్రి మేనేజ్‌మెంట్‌లో కీలకంగా ఉన్న టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కోడలు రాయపాటి మమతకు పోలీసులు 160 సీ ఆర్ పీ సీ నోటీసులు ఇచ్చారు. ఇటీవలే కరోనా నుండి కోలుకున్న ఆమె విచారణ కోసం ఈ రోజు విజయవాడలోని సౌత్ ఏసీపీ కార్యాలయానికి వచ్చారు. ప్రస్తుతం మమత నుంచి ఏసీపీ సూర్యచంద్రరావు వివరాలు సేకరిస్తున్నారు.
ఈ విచారణలో భాగంగా అసలు హాస్పటల్ వారు కోవిడ్ రోగులను ఎలా అడ్మిట్ చేసుకుంటున్నారు ? వీరికి అనుమతి ఉందా ? అనే విషయాలపై ఆమెను విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక కోవిడ్ ఫేషెంట్ల నుంచి ఎంత అమౌంట్ వసూలు చేస్తున్నారన్న దానిపై కూడా విచారణ కొనసాగుతోంది. ఈ హాస్పటల్ మేనేజ్‌మెంట్‌లో మమత కీలకంగా ఉన్నారని కూడా తెలుస్తోంది. మరో పక్క పరారీలో ఉన్న రమేష్ ఆసుపత్రి ఛైర్మెన్ రమేష్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. కేవలం రమేష్ పరారీలో ఉండటం వల్లే మానేజ్మెంట్, డాక్టర్లను విచారిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.