కరోనాతో ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు మృతి చెందారు. ఈ క్రమంలోనే ఓ కాంగ్రెస్ ఎంపీని సైతం కోవిడ్ బలి తీసుకుంది. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులు, కన్యాకుమారి కాంగ్రెస్ ఎంపీ హెచ్ వసంత్‌కుమార్ (70) శుక్రవారం మరణించారు. కొద్ది రోజులుగా కోవిడ్‌తో బాధపడుతోన్న ఆయన చెన్నైలో అపోలోలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కోవిడ్ లక్షణాలు తీవ్రం కావడంతో ఆయన్ను ఈ నెల 10 ఆసుపత్రిలో చేర్పించారు.
మూడువారాల పాటు కరోనాతో పోరాడి ఆయన తుదిశ్వాస విడిచారు. వసంత్‌కుమార్ తమిళనాడు కాంగ్రెస్ కమిటీ మాజీ చీఫ్ కుమారి అనంతన్ సోదరుడు కాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆయన సమీప బంధువు. ఆయన 2006లో తొలిసారి నంగునెరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2016లో మరోసారి అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక గత ఎన్నికల్లో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అప్పటి కేంద్ర మంత్రి పొను రాధాకృష్ణన్‌పై పోటీ చేసి కన్యాకుమారి నుంచి ఎంపీగా గెలిచారు. వసంతకుమార్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఆయన మృతి తమిళనాడు కాంగ్రెస్‌కు పెద్ద లోటే అని చెప్పాలి.