ఏపీ రాజకీయాల్లో వైసీపీ ప్రభుత్వం ఉరుకులు పరుగులు పెడుతున్నామనుకుంటున్నా…. అనాలోచిత నిర్ణయాలతో కోర్టుల్లో వరుసగా ఎదురు దెబ్బలు తింటోన్న మాట వాస్తవం. కోర్టుల నుంచి వరుసగా మెట్టికాయలు పడుతున్నా మాత్రం జగన్ తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లా అన్న ధోరణితోనే ముందుకు వెళుతున్నట్టు కనిపిస్తోంది. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం రాజ్యాంగ పరమైన చట్టాలు చేసినప్పుడు… దాని పాలన ఎలా ఉంది ? తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు కోర్టులకు ఎప్పుడూ ఉంది.
ఇక ఏపీలో యేడాది కాలంగా జగన్‌కు వరుసగా కోర్టుల్లో ఎదురవుతోన్న ఎదురు దెబ్బల నేపథ్యంలో పెద్ద మైనస్ అవుతోంది. మూడు రాజధానుల బిల్లు గవర్నర్ ఆమోదించినా.. జగన్ పంతం నెగ్గినా ఇప్పుడు కోర్టు స్టే వల్ల ఎటూ కదలని పరిస్థితి ఉంది. దీంతో జగన్ దూకుడుకు పెద్ద బ్రేక్ పడినట్లయ్యింది. ఈ వరుస పరిణామాలు వైసీపీలోనూ… ఆ పార్టీ నేతల్లోనూ తీవ్ర నిరుత్సాహానికి కారణమవుతున్నాయి. మరోవైపు టీడీపీ ఈ పరిణామాలను బలంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో సక్సెస్ అవుతోంది.
దీంతో జగన్ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కావచ్చు.. రాజధాని మార్పు విషయంలోనూ… ఏకంగా ఎన్నికల కమిషనర్‌నే టార్గెట్ చేసే విషయంలోనూ వరుసగా దెబ్బమీద దెబ్బలు తగులుతుండడంతో చులకన అవుతున్నారన్నది మాత్రం వాస్తవం. ఇక తాజాగా రాజధానికి బ్రేక్ వల్ల విశాఖ రాజధాని ఎంతెంత దూరం అని వైసీపీ వేచి చూడాల్సిందేనా ? అన్న సందేహం వస్తోంది. మరి ఈ వరుస షాకుల నుంచి జగన్‌కు ఎప్పుడు బ్రేక్ వస్తుందో ? చూడాలి.