రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం… భార్య‌కు క‌రోనా వ‌చ్చింద‌ని భ‌ర్త చేసిన ఘోరం ఇదే… బెంగ‌ళూరును క‌దిలించిన విషాదం

ధర్మార్థ కామ మోక్షాలతో తోడునీడగా ఉంటానని ప్రేమించి మ‌రీ పెళ్లి చేసుకున్న ఓ భ‌ర్త ఘోర‌మైన ప‌నిచేశాడు. బెంగ‌ళూరులో జేపీ న‌గ‌ర ప్రాంతంలో గౌరి (27), మంజునాథ్‌ దంపతులు ఉంటున్నారు. ఉత్త‌ర క‌ర్నాట‌క ప్రాంతానికి చెందిన వీరు రెండేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకుని బెంగ‌ళూరులో ఉంటూ ప‌ని చేసుకుని జీవిస్తున్నారు. మంజునాథ్ కారు డ్రైవ‌ర్‌.. గౌరి షాపింగ్ మాల్లో ప‌ని చేస్తున్నారు. రెండు రోజుల క్రితం గౌరికి జ్వ‌రం రాగా ప‌రీక్ష‌ల్లో ఆమెకు క‌రోనా ఉన్న‌ట్టు తేలింది. దీంతో మంజునాథ్ భార్య‌ను ఇంటికి తీసుకువ‌చ్చి వ‌దిలేసి ఎక్క‌డికో వెళ్లిపోయాడు.

 

ఆమెకు శ్వాస స‌మ‌స్య కూడా ఉండ‌డంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆమె శుక్రవారం ఇంట్లోనే మృతిచెందింది. శ‌నివారం ఇంటి య‌జ‌మాని ఈ విష‌యం గ‌మ‌నించ‌గా… స్తానిక కార్పొరేట‌ర్ శివ‌రాజ్ ప‌లుసార్లు మంజునాథ్‌కు ఫోన్ చేసినా ఎత్త‌లేదు. చివ‌ర‌కు ఫోన్ స్విచ్ఛాఫ్ కూడా చేసుకున్నాడు. ఈ విష‌యాన్ని మృతురాలి బంధువుల‌కు చెప్ప‌గా… ఆమె ప్రేమ వివాహం చేసుకున్న‌నాటి నుంచే త‌మ‌కు దూర‌మైంద‌న్నారు.

 

దీంతో చేసేదేమి లేక కార్పొరేట‌ర్ , స్థానికులు క‌లిసి కార్పొరేషన్‌ అంబులెన్స్‌ను రప్పించి అంత్యక్రియలు జరిపించారు. ఘరానా భర్తపై శంకరమఠ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ విషాద ఘ‌ట‌న మాన‌వ సంబంధాల‌ను ఎంత‌లా మంట‌గ‌లుపుతోందో చెప్పేందుకు నిద‌ర్శ‌నం కాగా.. ఇది బెంగ‌ళూరు సిటీలో బాగా వైర‌ల్ అయ్యింది.

Leave a comment