బీజేపీ మీద ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్న తమ్ముళ్ళు… !

ఏపీ బీజేపీకి సోము వీర్రాజు అధ్యక్షుడు అయ్యాక రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారినట్లు కనిపిస్తున్నాయి. మొన్నటివరకు కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడుగా ఉన్న సమయంలో, బీజేపీ కాస్త వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకం అన్నట్లు కనిపించింది. కానీ సోము అధ్యక్షుడు అయ్యాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వీర్రాజు టీడీపీని టార్గెట్ చేయడంతో, బీజేపీ జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా నడుస్తుందనే ప్రచారం మొదలైంది.

 

పైగా తామే అసలైన ప్రతిపక్షం అని చెబుతుండటంతో వీర్రాజు అసలు టార్గెట్ టీడీపీ అని అర్ధమైపోతుంది. టీడీపీని తోక్కేసి ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నట్లు కనబడుతోంది. అయితే బీజేపీ చేసే ప్రయత్నాలు ఏ మాత్రం సఫలం కావని తెలుగు తమ్ముళ్ళు గట్టిగా చెబుతున్నారు. ఏదో కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి, ఇక్కడ రాష్ట్రంలో కాస్త హడావిడి చేస్తున్నారని, లేదంటే ఆ పార్టీకి అంత సీన్ లేదనే అంటున్నారు.

 

అసలు మొన్న ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిందే 1 శాతం కంటే తక్కువ ఓట్లు అని, కనీసం నోటాని కూడా దాటి ఆ పార్టీ ఓట్లు తెచ్చుకోలేదని ఎద్దేవా చేస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో బీజేపీ పోటీ పడాల్సింది నోటాతో అని, టీడీపీ తో పోటీ పడే స్థాయి బీజేపీకి లేదనే చెబుతున్నారు. అసలు విభజన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న బీజేపీని ఏపీ ప్రజలు నమ్మే స్థితిలో లేరని, కాబట్టి బీజేపీ నేతలు ఎంత హడావిడి చేసిన ఉపయోగం లేదని అంటున్నారు.

 

ప్రస్తుతానికి ఎవరైనా నాయకులు బీజేపీ వెనుక వెళ్లొచ్చేమో గానీ, కార్యకర్తలు మాత్రం వెళ్ళడం కష్టమని చెబుతున్నారు. అసలు ఓట్లు తెచ్చుకోవడంలో నోటాని దాటి బీజేపీ వెళ్లలేదని తమ్ముళ్ళు ఫుల్ కాన్ఫిడెన్స్‌గా ఉన్నారు. ఇదే సమయంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని జనసేన ఎదగడం కూడా కష్టమని, కాబట్టి పవన్ కల్యాణ్ ఈ విషయం ఆలోచించుకుంటే బెటర్ అని సూచిస్తున్నారు.