ఏపీ రాజకీయాలని మూడు రాజధానుల అంశం కుదిపేస్తున్న విషయం తెలిసిందే. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతలు ఈ మూడు రాజధానులపై మాటల యుద్ధం చేస్తున్నారు. పైగా దీనిపై సవాళ్ళు, ప్రతి సవాళ్ళు కూడా నడుస్తున్నాయి. అయితే ఎన్ని సవాళ్ళు నడిచినా, జగన్ మూడు రాజధానులని అమలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మూడు రాజధానుల ఏర్పాటుని ప్రతిపక్ష టీడీపీ ఎంత అడ్డుకోవాలని చూస్తున్నా, ఆ ప్రక్రియ ఆగేలా లేదు.
ఇక అమరావతి కోసం ఉద్యమం చేస్తున్న రైతులు మాత్రం కోర్టుని నమ్ముకుని ఉన్నారు. హైకోర్టు మూడు రాజధానులకు బ్రేక్ వేస్తుందేమో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎన్ని జరిగినా జగన్ మూడుపై వెనక్కి తగ్గడం కష్టం. కాకపోతే జగన్ మూడు రాజధానులని అమలు చేసినా సరే, వెనక్కి తగ్గమని తెలుగు తమ్ముళ్ళు చెబుతున్నారు. ప్రస్తుతం జగన్ మూడు రాజధానుల్లో భాగంగా విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలుని జ్యుడీషియల్ క్యాపిటల్, అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా చేయాలనుకుంటున్న సంగతి తెలిసిందే.
కానీ టీడీపీ మాత్రం మొత్తం రాజధాని అమరావతిలోనే ఉండాలని డిమాండ్ చేస్తోంది. టీడీపీ డిమాండ్‌ని పట్టించుకోకుండా జగన్ మూడుపై ముందుకెళితే, నెక్స్ట్ తాము అధికారంలోకి వస్తే మూడు రాజధానులు ఉండవని తమ్ముళ్ళు చెబుతున్నారు. ఒకవేళ మూడు రాజధానులని ఫ్రీజ్ చేస్తూ, అంటే మళ్ళీ రాజధాని మార్చకుండా జగన్ ఏదైనా చట్టం చేసినా కూడా, ఇప్పుడు అమరావతి కోసం తీసుకొచ్చిన సిఆర్‌డిఏ చట్టం రద్దు ఎలా చేశారో, అలా రద్దు చేసి మళ్ళీ అమరావతిని రాజధానిగా చేస్తామని అంటున్నారు.
చంద్రబాబు ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని నిర్మిస్తే జగన్ దానిని ఎలా విచ్ఛిన్నం చేశారో ప్రస్తుతం జగన్ విశాఖలో తన రియల్ వ్యాపారాలకు రాజధానిని మార్చారని.. తాము అధికారంలోకి రాగానే దేశం గర్వించేలా అమరావతిని పూర్తి చేస్తామని.. ఈ బంగారు ఛాన్స్ బాబుదే అని చెపుతున్నారు. మరి చూడాలి నెక్ట్స్ ఎన్నికల తర్వాత ఏపీ రాజధానిగా ఏది ఉంటుందో.. ?