డ్రాగన్ చైనాకు భారత్ మరో షాకిచ్చేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే పలు యాప్‌లను నిషేధించడంతో చైనాలో పలు వ్యాపార సంస్థలకు భారత్ మార్కెట్ పోవడంతో భారీ నష్టం వాటిల్లింది. అప్పటి నుంచి ఏదో ఒక రూపంలో చైనాకు భారత్ షాక్ ఇస్తూనే వస్తోంది. ఈ క్రమంలోనే మరో షాక్ చైనాకు తగలనుంది. భారత్‌లో అడుగుపెట్టాలనుకునే చైనీయులకు ఇకపై వీసా నిబంధనలు మరింత కఠినతరం చేసే యోచనలో ఉంది. ఇందులో భాగంగా చైనీయుల నుంచి వచ్చే వీసా దరఖాస్తులపై మరింత లోతైన పరిశీలన జరపనుంది.
ఇకపై చైనీయులు ఎవరైనా భారత్‌లోకి ఎంట్రీ ఇవ్వాలంటే భారత విదేశీ వ్యవహారాల మంత్రి శాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే చైనా వ్యాపారవేత్తలు, ఇతర రంగాకు చెందిన నిపుణులు మనదేశంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు మరింత కఠిన నిబంధనలు సైతం రూపొందించాలని భారత ప్రభుత్వం భావిస్తోందట. ఇప్పటివరకూ ఇలాంటి వీసా నిబంధనలు పాకిస్తాన్‌పై భారత్ అమలుచేస్తూ వచ్చింది. సరిహద్దు వివాదం నేపథ్యంలో ఇప్పుడు చైనా పట్ల కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని భారత్ యోచిస్తోంది.