భీష్మ సెన్సార్ టాక్.. ఎలా ఉందంటే?

యంగ్ హీరో నితిన్ నటిస్తు్న్న తాజా చిత్రం భీష్మ షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో నితిన్ మరో సక్సెస్‌ను ఖచ్చితంగా కొడతాడని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ చిత్రంలో అందాల భామ రష్మిక మందన నటిస్తు్ండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఇప్పటికే జనాల్లో మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు కూడా ముగించేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు వారు క్లీన్ యు సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సినిమా పూర్తి ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిందని, నితిన్ ఈ సినిమాలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడని వారు కితాబిచ్చారు. ఈ సినిమాలో ఎలాంటి కట్‌లు లేకుండా ఓకే చేసినందుకు సెన్సార్ వారికి చిత్ర యూనిట్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సినిమా రన్‌టైమ్ 2 గంటల 20 నిమిషాలుగా చిత్ర యూనిట్ ఫిక్స్ చేశారు. నితిన్ తనదైన టైమింగ్‌తో ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తాడని, ప్రేక్షకులను ఆయన ఖచ్చితంగా అలరిస్తారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.