కొండారెడ్డి బురుజు దగ్గర బేరాల్లేవమ్మా!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా కథ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడంలో ఎలాంటి సందేహం లేదని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో అదిరిపోయే సీక్వెన్సులు ఎన్ని ఉన్నా, కథను మలుపు తిప్పేది మాత్రం కొండారెడ్డి బురుజు అంటున్నారు చిత్ర యూనిట్.

ఆర్మీ మేజర్ అయిన మహేష్ కొన్ని కారణాల వల్ల రాయలసీమకు వస్తాడని, అక్కడ జరిగే పరిణామాలను చూసిన ఆయన వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాడట. అయితే ఈ క్రమంలో కొండారెడ్డి బురుజు వద్ద జరిగే సీక్వెన్స్ సినిమా కథను పూర్తిగా మలుపు తిప్పుతుందని తెలుస్తోంది. ఈ హై ఓల్టేజ్‌ సీక్వెన్స్‌తో అదిరిపోయే ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది.

మొత్తానికి సినిమాకు విపరీతమైన క్రేజ్‌ను తీసుకొచ్చేందుకు సోషల్ మీడియాను చిత్ర యూనిట్ అన్ని విధాలుగా వినియోగిస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే అంటున్నారు ప్రేక్షకులు.

Leave a comment