Moviesరజినీకాంత్ దర్బార్ మూవీ రివ్యూ & రేటింగ్

రజినీకాంత్ దర్బార్ మూవీ రివ్యూ & రేటింగ్

సినిమా: దర్బార్
నటీనటులు: రజినీకాంత్, నయనతార, నివేదా థామస్, సునీల్ శెట్టి తదితరులు
సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్
సంగీతం: అనిరుధ్ రవిచందర్
నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్
దర్శకత్వం: ఏఆర్ మురుగదాస్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అంటే తమిళనాట పండగ వాతావరణం నెలకొంటుంది. తాజాగా ఆయన నటించిన దర్బార్ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా కాలం తరువాత పోలీస్ ఆఫీసర్ పాత్రలో రజినీ నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన దర్బార్ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ:
ఆదిత్య అరుణాచలం(రజినీకాంత్) ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ట్రాన్స్‌ఫర్‌పై ఆయన ముంబై చేరుకుంటాడు. అక్కడ అప్పటికే హరి చోప్రా(సునీల్ శెట్టి) అరాచకాలు సృష్టస్తూ తన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. కాగా నేరాలు చేయొద్దని ముందు మామూలుగా హెచ్చరిస్తాడు రజినీకాంత్. అయినా హరి చోప్రా తన పద్ధతి మార్చుకోకపోవడంతో అతడి ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమవుతాడు రజినీ. ఈ క్రమంలో హరి చోప్రా, ఆదిత్య అరుణాచలంల మధ్య సాగే యుద్ధమే ఈ సినిమా కథ. చివరకు హరిచోప్రాను అరుణాచలం ఏం చేశాడు? అసలు ముంబైకి రజినీ ఎందుకు ట్రాన్స్‌ఫర్ అయ్యాడు? అనేది సినిమా కథ.

విశ్లేషణ:
రజినీకాంత్ సినిమా అంటే ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన సినిమా రిలీజ్ రోజున చూడాలని తమిళ ప్రజలే కాకుండా అన్ని భాషల ప్రజలు కోరుకుంటారు. ఇంతటి క్రేజ్ ఉన్న సూపర్ స్టార్, మరో క్రేజీ డైరెక్టర్‌తో జతకట్టి తీసిన దర్బార్ చిత్రం కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఎట్టకేలకు నేడు థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా తలైవా ఫ్యాన్స్‌కు బిర్యానీ వడ్డించినట్లు ఉందని చెప్పాలి.

ఈ సినిమా కథనం విషయానికి వస్తే దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఓ రొటీన్ కథను రాసుకున్నా, దానిని రజినీ తన స్టైల్‌తో మెప్పించాడు. ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ బదిలీపై ముంబై చేరుకుంటాడు. అక్కడ అరాచకాలకు కేరాఫ్ అయిన హరి చోప్రాతో యుద్ధం ప్రకటిస్తాడు. ఈ క్రమంలో నయనతారను చూసిన ఇష్టపడి ఆమెను ప్రేమిస్తాడు రజినీకాంత్. అయితే హరి చోప్రా ఆగడాలు మరింత ఎక్కువవడంతో రజినీకాంత్ ఆయకు వార్నింగ్ ఇస్తారు. ఓ అదిరిపోయే ట్విస్టుతో వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ సూపర్‌గా ఉంటుంది.

ఇక సెకండాఫ్‌లో టామ్ అండ్ జెర్రీ ఫైట్‌లా రజినీ, సునీల్ శెట్టిల మధ్య వార్ నడుస్తుంది. మైండ్ గేమ్‌తో సునీల్ శెట్టి అండ్ గ్యాంగ్‌కు చుక్కలు చూపిస్తాడు రజినీ. అయితే ఈ క్రమంలో రజినీకాంత్‌కు ఓ నష్టం కలిగిస్తాడు సునీల్ శెట్టి. దీంతో సునీల్ శెట్టిని అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు రజినీ. చివరకు సునీల్ శెట్టికి రజినీకాంత్ ఎలా చెక్ పెట్టాడనే అంశాన్ని మురుగదాస్ చాలా బాగా చూపించాడు. ఓ చక్కటి ఫినిషింగ్‌తో సినిమాను ముగించాడు దర్శకుడు.

ఓవరాల్‌గా రజినీకాంత్ నుంచి ఏదైతే సినిమాను ఆశిస్తారో అలాంటి యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను మురుగదాస్ ప్రేక్షకులకు అందించాడు. కథ రొటీన్ అయినా రజినీకాంత్ తన మేనరిజం, స్టైల్‌తో సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు. ఇక రజినీ చెప్పే డైలాగులకు థియేటర్లలో విజిల్స్ వేస్తారు ఆడియెన్స్.

నటీనటుల పర్ఫార్మెన్స్:
సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ సినిమాలో చాలా ఎనర్జెటిక్‌గా కనిపించారు. అల్ట్రా స్టైలిష్ లుక్‌లో రజినీ యాక్టింగ్ పీక్స్. ఇక నయనతార కూడా ఈ సినిమాలో బాగానే చేసింది. విలన్‌గా నటించిన సునీల్ శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆయన యాక్టంగ్ ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. మిగతా నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు ఏఆర్ మురుగదాస్ గతంలో అందించిన విభిన్న కథలను పూర్తిగా మరిచిపోయినట్లు అనిపిస్తుంది. రొటీన్ కథను ఈ సినిమాకు అందించి సూపర్ స్టార్ స్థాయిని తక్కువ చేశాడనే చెప్పాలి. కానీ స్క్రీన్‌ప్లే పరంగా ఆయన సినిమాకు బాగా పనిచేశారు. సినిమాటోగ్రఫీ సినిమాకు మరో బలం అని చెప్పాలి. చాలా సీన్స్‌ను బాగా హైలైట్ చేసి చూపించారు. అనిరుథ్ అందించిన మ్యూజిక్ బాగుంది. బీజీఎం వర్క్ కూడా చాలా బాగుంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు గ్రాండ్‌గా ఉన్నాయి. సినిమాను చాలా రిచ్‌గా చూపించారు.

చివరగా:
దర్బార్ – రజినీ వన్ మ్యాన్ షో!

రేటింగ్:
3.0/5.0

Latest news