ట్రైలర్ టాక్: కారప్పొడితో వార్నింగ్ ఇచ్చిన కళ్యాణ్ రామ్

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తోన్న తాజా చిత్రం ఎంత మంచివాడవురా అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను సంక్రాంతి బరిలో ధీమాగా దించుతున్నారు చిత్ర యూనిట్. శతమానం భవతి వంటి బ్లాక్‌బస్టర్ అందించిన దర్శకుడు సతీష్ వేగేశ్న ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ అంచనాలను రెట్టింపు చేసింది తాజాగా రిలీజైన ఈ చిత్ర ట్రైలర్.

తండ్రి కోసం ఏదైనా చేసే కొడుకు పాత్రలో నటించిన కళ్యాణ్ రామ్, ఆ తండ్రి జోలికి ఎవ్వరు వచ్చినా ఊరుకోనంటూ ఇచ్చే వార్నింగ్ సూపర్‌గా ఉంది. మెహ్రీన్‌తో రొమాన్స్, సుహాసినీ,శరత్ బాబుల మధ్య వచ్చే ఫ్యామిలీ డ్రామాను ఈ ట్రైలర్‌లో చూపించారు. భారీ తారాగణం ఉన్న ఈ సినిమా ట్రైలర్ చూస్తే కళ్యాణ్ రామ్ ఖచ్చితంగా హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు.

అటు సంక్రాంతి బరిలో రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నా అవి ఫ్యామిలీ సబ్జెక్టులు కాకపోవడం ఈ సినిమాకు బాగా కలిసొచ్చే అంశం. ఆ రెండు సినిమాల టాక్‌ కాస్త అటుఇటుగా వచ్చిందంటే, కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా సినిమా ఖచ్చితంగా పుంజుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి జనవరి 15న రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్‌ను అందుకుంటుందో చూడాలి.

Leave a comment