డిస్కో రాజా చిత్రం ఫలితంపై రవితేజ అనుమానం..?

మాస్ రాజా రవితేజ గతకొంత కాలంగా సరైన హిట్స్ లేక సతమతమవుతున్నాడు. రాజా ది గ్రేట్ వంటి యావరేజ్ హిట్ తరువాత రవితేజ చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవ్వడంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. దీంతో రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘డిస్కో రాజా’పై ఆయన భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఔట్ ఆఫ్ ది బాక్స్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకుల్లో ఓ మోస్తరు అంచనాలను మాత్రమే క్రియేట్ చేశాయి. మాస్ ఎంటర్‌టైనర్‌ సినిమాలకు కేరాఫ్‌గా ఉండే రవితేజ ఈ సినిమా ప్రమోషన్స్‌ విషయంలోనూ పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో ఈ సినిమా విజయంపై చిత్ర వర్గాల్లో అనుమానం రేకెత్తుతోంది.

చిన్న హీరోలతో పనిచేసిన విఐ ఆనంద్ అదిరిపోయే వావ్ అంశాలున్న కథను ఎంచుకుంటే తప్ప ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఎనర్జిటిక్ పాత్రలను రెట్టింపు ఎనర్జీతో చేసే రవితేజ, ఈ సినిమాలో చాలా సీరియస్ మోడ్‌లో ఉండే పాత్రను చేస్తున్నట్లు టీజర్ల ద్వారా తెలుస్తోంది. రొటీన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు కాస్త భిన్నంగా ఉండే ఈ సినిమాలో రవితేజ పాత్రలో ఏమాత్రం తేడా కొట్టినా అది సినిమా రిజల్ట్‌పై ప్రభావం చూపడం ఖాయం. అటు రవితేజ సినిమాకు చక్కటి సంగీతం అందించిన రికార్డు థమన్‌కు ఉంది. ఇటీవల అల వైకుంఠపురములో సినిమాతో తన కెరీర్ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చిన థమన్ ఈ సినిమాకు ఇచ్చిన మ్యూజిక్‌ కూడా గొప్పగా లేకపోవడం సినిమాకు ప్రతికూల అంశం.

మరి ఇన్ని ప్రతికూల అంశాలున్న డిస్కోరాజా చిత్రం రవితేజకు అవసరమైన సక్సెస్‌ను అందించగలదా? డిస్కో రాజాకు హీరోగా కేవలం కంటెంట్‌ మాత్రమే నిలవనుందా? హీరోగా రవితేజ ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడు? ఈ సినిమా కూడా ఆయనకు ఓ పీడకలేనా? అనే ప్రశ్నలకు సినిమా రిలీజ్ అయ్యాకే సమాధానం దొరుకుతుంది. పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈనెల 24న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

Leave a comment