మహేష్‌కు బిస్కెట్ ఇచ్చిన సరిలేరు నీకెవ్వరు

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాతో మరోసారి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌తో మహేష్ తన అభిమానులను అలరించారు. దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా వంద కోట్లకు పైగా షేర్ కలెక్షన్లు సాధించిందంటూ చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమా సక్సెస్ కావడంతో మహేస్ తన ఫ్యామిలీతో కలిసి హాలీడేస్‌కు విదేశాలకు వెళ్లారు. అయితే ఈ సినిమా మహేష్‌ బాబుకు ఏం మిగిల్చిందనే అంశంపై టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది.

మహేష్ తన సినిమా రిలీజ్ అవ్వగానే ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లడం షరా మామూలే. కానీ సరిలేరు నీకెవ్వరు సినిమా రిలీజ్‌కు ముందు మహేష్ బాబు తన కెరీర్‌లోనే చేయని విధంగా అదరగొడుతున్నారంటూ గొప్పలు చెప్పుకొచ్చింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో మహేష్ పర్ఫార్మెన్స్‌ ఆడియెన్స్‌కు చాలా కాలం పాటు గుర్తుండిపోతుందని దర్శకుడు సహా భజన చేశారు. కానీ ఈ సినిమా చూసిన సదరు ప్రేక్షకుడు మహేష్ యాక్టింగ్‌లో ప్రత్యేకత ఏమీ లేదని, మిగతా సినిమాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా నటించారని చెబుతున్నారు. ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా చిత్ర యూనిట్ ప్రకటిస్తున్న కలెక్షన్ల విషయంలోనూ వంద శాతం స్పష్టత లేకపోవడంతో అవి ఫేక్ కలెక్షన్లు అంటూ పలువురు విమర్శిస్తున్నారు.

తన యాక్టింగ్‌లో కొత్తదనం, ప్రత్యేకత ఏమీ లేకపోవడం.. కలెక్షన్ల విషయంలోనూ స్పష్టత లేకపోవడంతో సరిలేరు నీకెవ్వరు చిత్రం కూడా మహేష్ కెరీర్‌లో ఓ సాధారణ చిత్రంగా నిలిచిపోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా మహేష్‌కు పెద్దగా వెలగబెట్టిందేమీ లేదని, ఆయన కెరీర్‌లో మరో సినిమాగా మాత్రమే మిగిలిపోయిందని సినీ క్రిటిక్స్ అంటున్నారు. ఇకనైనా మహేష్ రొటీన్ సినిమాలు కాకుండా కాస్త వినూత్నమైన సినిమాలు చేస్తే బాగుంటుందని వారు అంటున్నారు.

Leave a comment