Moviesఅల్లు అర్జున్ అల వైకుంఠపురములో ఫస్ట్ రివ్యూ & రేటింగ్

అల్లు అర్జున్ అల వైకుంఠపురములో ఫస్ట్ రివ్యూ & రేటింగ్

సినిమా: అల వైకుంఠపురములో
నటీనటులు: అల్లు అర్జున్, పూజా హెగ్డే, నవదీప్, సుశాంత్, టబు తదితరులు
మ్యూజిక్: థమన్
సినిమాటోగ్రఫీ: పిఎస్ వినోద్
నిర్మాత: అల్లు అరవింద్, రాధాకృష్ణ
దర్శకత్వం: త్రివిక్రమ్
రిలీజ్ డేట్: 12/01/2020

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో సినిమాపై అటు ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో కలిసి ముచ్చటగా మూడోసారి జతకట్టిన బన్నీ ఈ సినిమాతోనూ తన సక్సెస్ జోరును కొనసాగిస్తాడని, చిత్రం బ్లాక్‌బస్టర్ ఖాయమని చిత్ర వర్గాలు అంచనాలు వేశాయి. మరి నేడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు ఎంతమేర అందుకుందో రివ్యూలో చూద్దాం.

కథ:
ఒకే ఆసుపత్రిలో మగబిడ్డలను కంటారు టబు మరియు రోహిణి. కాగా కొన్ని కారణాల వల్ల మురళీ శర్మ తన కొడుకును టబు కొడుకు స్థానంలోకి మారుస్తాడు. దీంతో టబు కొడుకు మురళీశర్మ ఇంట్లో, ఆయన కొడుకు టబు ఇంట్లో పెరుగుతారు. మురళీ శర్మ కొడుకు బంటి అలియాస్ దేవరాజ్(అల్లు అర్జున్) గొప్పవాడిగా జీవించాలని కలలు కంటాడు. టబు కొడుకు రాజ్(సుశాంత్) పెరిగి పెద్దవాడై వారి బిజినెస్‌లు చూసుకుంటాడు. కట్ చేస్తే పూజా కంపెనీలో ఉద్యోగానికి చేరిన బంటి, సుశాంత్ కుటుంబంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తాడు. ఈ క్రమంలో టబు ఫ్యామిలీకి సుమద్రకణి నుండి బెదిరింపు ఉంటుంది. అయితే మురళీశర్మ పుట్టిన బిడ్డలను ఎందుకు మార్చాడు..? టబు ఫ్యామిలీని బంటి ఎలా కాపాడు..? అసలు బంటి ఎవరనే విషయం టబు ఫ్యామిలీకి ఎలా తెలుస్తుంది..? అనేది సినిమా కథ.

విశ్లేషణ:
త్రివిక్రమ్ మార్క్ సినిమా అంటేనే క్లాస్ ఆడియెన్స్‌కు పండగ అని చెప్పాలి. అల వైకుంఠపురములో చిత్రం మాత్రం అటు క్లాస్‌తో పాటు మాస్ ఆడియెన్స్‌ను కూడా మెప్పించడం ఖాయం. త్రివిక్రమ్ రాసుకున్నది పాత రొటీన్ కథ అయినా దాన్ని తనదైన శైలిలో ప్రెజెంట్ చేసిన విధానం బాగుంది. కథలో ప్రేక్షకులను లీనం చేయడం త్రివిక్రమ్ మార్క్‌కు అద్దం పడుతుంది.

ఇక కథనం విషయానికి వస్తే.. ఫస్టాఫ్‌లో ఇద్దరు మహిళలు ఒకేసారి బిడ్డలను కనడం, అందులో ఒకరిని మార్చడం పాత రొటీన్ సినిమాలలోని అంశంగా మనకు కనిపిస్తుంది. వారు పెరిగి పెద్దవారై గొప్పవారి కొడుకు మధ్యతరగతి వాడిగా, మధ్యతరగతి వాడి కొడుకు గొప్పోడిగా ఎదుగుతారు. అయితే గొప్పవారి కొడుకైన సుశాంత్ ఇంటికి చేరుతాడు బన్నీ. కంపెనీ పనులతో పాటు వారి ఇంటి సమస్యలను చూసి వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో ఆ పూజా హెగ్డేను చూసి ప్రేమిస్తాడుబన్నీ. అయితే ఓ అద్భుతమైన ట్విస్టుతో వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాపై మరిన్ని అంచనాలు రేకెత్తిస్తుంది.

అటు సెకండాఫ్‌లో టబు ఫ్యామిలీకి సముద్రకనితో గొడవను హైలైట్ చేసి చూపించాడు త్రివిక్రమ్. ఈ గొడవను బన్నీ ఎలా డీల్ చేశాడనేది మనకు సెకండాఫ్‌లో చూపించారు. ఇక ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లను యాక్షన్‌తో పాటు ఎమోషనల్ బాండింగ్‌తో ముగించాడు త్రివిక్రమ్. ఓ చక్కటి ముగింపుతో సినిమాకు శుభం కార్డు వేశాడు దర్శకుడు.

ఓవరాల్‌గా చూస్తే.. త్రివిక్రమ్ మార్క్ కథ కాకపోయినా ఆయన దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం ప్రేక్షకులను ఖచ్చితంగా మెప్పిస్తుంది. ఇక ఈ సినిమాలోని పాటలు మాత్రం ఆడియెన్స్ చేత విజిల్స్ వేయిస్తాయి. బన్నీ యాక్టింగ్‌కు త్రివిక్రమ్ డైలాగులు పంచులై పేలాయి. మొత్తానికి ఈ సంక్రాంతికి త్రివిక్రమ్ నుండి ఏదైతే సినిమాను ఆశిస్తారో దాన్ని ఖచ్చితంగా అల వైకుంఠపురములో చూసి ఆస్వాదిస్తారు.

నటీనటుల పర్ఫార్మెన్స్:
మిడిల్ క్లాస్ అబ్బాయిగా బన్నీ నటన బాగుంది. జులాయి సినిమా తరహా పాత్ర కావడంతో బన్నీ యాక్టింగ్‌ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ఇక సుశాంత్, నవదీప్‌లు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించిన మురళీ శర్మ, టబులు కూడా తమ నటనతో మెప్పిస్తారు. కమెడియన్‌గా సునీల్ మెప్పించ లేకపోయాడు. హీరోయిన్‌గా పూజా హెగ్డే సూపర్. మిగతా నటీనటులు తమ పాత్రల మేర బాగా రాణించారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
మాటలతో మంత్రం వేసే దర్శకుడిగా త్రివిక్రమ్ తనదైన మార్క్‌ను మరోసారి ఈ సినిమాలో చూపించాడు. రొటీన్ కథను తనదైన శైలిలో తెరకెక్కించి మామూలు సినిమాను కూడా సక్సెస్ ఎలా చేయాలో అల వైకుంఠపురములో సినిమా ద్వారా మరోసారి నిరూపించుకున్నాడు. త్రివిక్రమ్ టేకింగ్‌కు ప్రత్యేకించి మార్కులు పడ్డాయి. థమన్ అందించిన సంగీతం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ముఖ్యంగా ఈ సినిమాలో థమన్ తన కెరీర్ బెస్ట్ సంగీతం అందించాడనడంలో ఎలాంటి సందేహం లేదు. అన్ని పాటలు చాలా బాగున్నాయి. అటు బీజీఎం వర్క్‌లోనూ తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు థమన్. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ప్రతి ఫ్రేంను చక్కగా చూపించారు. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి.

చివరగా:
అల వైకుంఠపురములో – త్రివిక్రమ్ నిజంగానే ఆగం చేశాడు!

రేటింగ్: 3.0/5.0

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news