ప్రతి రోజు పండగే ట్రైలర్ టాక్

మెగా కాంపౌండ్ నుంచి వచ్చి సుప్రీం హీరోగా ఎదిగిన సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ప్రతి రోజు పండగే ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ చేశారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాపై తేజు ఇప్పటికే భారీ నమ్మకం పెట్టుకున్నాడు. వరుసగా ఫ్లాపులు చవిచూస్తున్న తేజు ఈ సినిమాతో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. కాగా ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా రిలిజ్ చేశారు చిత్ర యూనిట్.

ఈ ట్రైలర్ చూస్తుంటే ఇదేదో పాత చింతకాయ పచ్చడి సినిమాలా అనిపించక తప్పదు. తాత కోసం మనవడు రావడం.. ఇదే కాన్సెప్టుతో అనేక చిత్రాలు వచ్చాయి. కానీ ఇందులో తాత తెలివికి కుటుంబ సభ్యులు మొత్తం అవాక్కవ్వడం ఇదే తొలిసారి. ఈ సినిమాలో తాత పాత్రలో సత్యరాజ్ నటిస్తోండగా, మనవడి పాత్రలో సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్నాడు. పూర్తి ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇక ఫ్యామిలీ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉన్నట్లు మనకు పోస్టర్లు, టీజర్లు చూస్తే తెలుస్తోంది. అయితే ట్రైలర్‌లో సినిమా కథను మారుతి మన ముందు ఉంచాడు. సినిమాపై ఎలాంటి అంచనాలతో వెళ్లాలో ముందే చిత్ర యూనిట్ రెడీ చేయడం హర్షించతగ్గ విషయం అంటున్నారు పలువురు సినీ విమర్శకులు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Leave a comment