కొత్త సంవత్సరం కానుకగా ఆర్ఆర్ఆర్ గిఫ్ట్.. ఏమిటో తెలుసా?

తెలుగులో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఆర్ఆర్ఆర్ మొదటి స్థానాన్ని దక్కించుకుంటుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి లాంటి విజువల్ వండర్‌ను తెరకెక్కించిన దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో వస్తున్న సినిమా కావడం, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంటి టాప్ స్టార్స్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అనే అంచనాలు అందరిలో ఏర్పడ్డాయి.

ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ బయటకు రానివ్వడం లేదు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ఏదైనా అప్‌డేట్ వస్తే బాగుంటుందని ప్రేక్షకులు ఎదురుచూస్తు్న్నారు. కాగా కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1న ఈ సినిమాకు సంబంధించి ఏదో అప్‌డేట్ ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆరోజున రిలీజ్ చేస్తారనే వార్త ప్రస్తుతం టీటౌన్‌లో హల్‌చల్ చేస్తోంది.

ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధుల జీవితాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ ఫిక్షన్ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. భారీ క్యాస్టింగ్‌తో పాటు కళ్లు చెదిరే బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుండటంతో ఈ సినిమా రిలీజ్ కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు జనం. మరి జనవరి 1న ఈ చిత్ర యూనిట్ ప్రేక్షకుల ఆశలపై నీళ్లు జల్లుతుందా లేక వారికి అదిరిపోయే ట్రీట్ ఇస్తుందా అనేది చూడాలి.

Leave a comment