అబ్బాయి బ్యూటీకి బాబాయి లిఫ్ట్ ఇస్తాడా?

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన వారు కూడా కాలంతో పాటు హీరోయిన్ పాత్రలకు దూరమై క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిన వారు చాలా మంది ఉన్నారు. వారిలో చాలా వరకు సక్సెస్ కాకపోయినా కొంతమంది మాత్రం తమ ట్యాలెంట్‌తో నిలదొక్కుకున్నారు. కాగా ఇప్పుడు ఇదే పాత్రలతో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుకోవాలని చూస్తోంది భూమిక.

ఖుషీ సినిమాతో తనదైన ఇమేజ్‌ను క్రియేట్ చేసి కుర్రకారును ఆకట్టుకున్న భూమిక సింహాద్రి, ఒక్కడు వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లోనూ నటించింది. ఆ తరువాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో అడపాదడప సినిమాలు చేసినా అనుకున్న మేర రాణించలేకపోయింది. కాగా తాజాగా బాలయ్య నటిస్తున్న రూలర్ చిత్రంలో భూమిక తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. ఈ సినిమాలో భూమికకు చాలా కీలక పాత్ర లభించినట్లు తెలుస్తోంది.

రూలర్ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తమిళ స్టార్ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ డైరెక్ట్ చేస్తుండగా సీ కళ్యాణ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మరి ఈ సినిమాలో భూమికకు లభించిన పాత్ర ఎలాంటిదో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.