దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్

తెలంగాణ రాష్ట్రంలోని శంషాబాద్ సమీపంలో జరిగిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటనతో ఒక్కసారిగా రాష్ట్రం ఉలిక్కిపడింది. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ప్రభుత్వాలు అడ్డుకోవాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. డాక్టర్ దిశను అత్యాచారం చేసి అతికిరాతకంగా హతమార్చారు.

ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసు కస్టడీ అప్పగించింది న్యాయస్థానం. కాగా ఈ కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా ఘటన జరిగిన స్థలంలో పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో నలుగురు నిందితులు పారిపోయే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసులు వారిని ఎన్‌కౌంటర్ చేశారు. ఈ దాడిలో నిందితులు ఆరిఫ్‌, శివ, నవీన్‌, చెన్నకేశవులు మృతి చెందినట్లు తెలుస్తోంది.

అయితే ఈ ఘటనకు సంబంధించి అధికారిక ప్రకటన పోలీసులు ఇంకా చేయలేదు. డాక్టర్ దిశ హత్య జరిగిన ప్రదేశంలోనే నిందితుల ఎన్‌కౌంటర్ జరిగింది. తమ కూతురి ఘటనలో న్యాయం జరిగిందంటూ దిశ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడం చాలా మంచి పని అంటూ పలువురు వారిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.