దిశ నిందితుల ఎన్‌కౌంటర్ జరిగిందిలా!

వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం కేసులో ప్రధాన నిందితులైన ఆరిఫ్, శివ, చెన్నకేశవులు, నవీన్‌లను న్యాయస్థానం పోలీసుల కస్టడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. కాగా కేసు విచారణలో భాగంగా ఘటనాస్థలంలో సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం వారిని శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు తీసుకెళ్లారు.

ఈ క్రమంలో పోలీసుల వద్ద ఉన్న తుపాకీలు లాక్కుని పారిపోయే ప్రయత్నం నిందితులు చేశారు. అయితే పోలీసులు ప్రతిఘటించడంతో రాళ్లతో వారిని కొట్టబోయారు. చీకటిగా ఉండటంతో వారు తప్పించుకునేందుకు ఇదే సరైన సమయం అనుకుని వారు భావించారు. కానీ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు నిందితులు హతమయ్యారని పోలీసులు తెలిపారు.

కాగా దిశను అతికిరాతకంగా హతమార్చిన నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. తమ కూతురికి న్యాయం జరిగిందని దిశ తల్లిదండ్రులు అన్నారు. అయితే తమ బిడ్డలను అన్యాయంగా పోలీసులు చంపారంటూ నిందితుల తల్లదండ్రులు వాపోయారు. ప్రస్తుతం ఈ ఎన్‌కౌంటర్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.