సినిమా: 90 ML
నటీనటులు: కార్తీకేయ, నేహా సోలంకి, రావు రమేష్ తదితరులు
సినిమాటోగ్రఫీ: జె.యువరాజ్
సంగీతం: అనూప్ రుబెన్స్
నిర్మాత: అశోక్ రెడ్డి గుమ్మకొండ
దర్శకుడు: శేఖర్ రెడ్డి
Rx100 సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు కార్తికేయ. ఆ సినిమా తరువాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతున్నాడు ఈ యంగ్ హీరో. కార్తికేయ నటించిన లేటెస్ట్ మూవీ 90 ML సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో మరోసారి హిట్ కొట్టాలని చూస్తు్న్నాడు కార్తికేయ. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ:
దేవదాస్(కార్తికేయ)కు చిన్నప్పటి నుండే విచిత్రమైన కారణంగా మద్యం తాగడం అలవాటు చేస్తుంది అతడి తల్లి. 90 ఎంఎల్ మద్యం తాగకపోతే అతడు చనిపోయే పరిస్థితి ఉంటుందని వైద్యులు తెలిపారు. దీంతో అతడికి చిన్నప్పటి నుండి 90 ఎంఎల్ మద్యం తాగడం అలవాటవుతుంది. కట్ చేస్తే మద్యం అంటే పడని కుటుంబం రావు రమేష్‌ది. ఆయన కూతురు సువాసన(నేహా సోలంకి)ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు దేవదాస్. అయితే రావు రమేష్ వారి ప్రేమను ఒప్పుకోడు. మరి తన ప్రేమను దేవదాస్ ఎలా దక్కించుకున్నాడు? అతడు మద్యం తాగడం మానేస్తాడా లేదా? అనేది సినిమా స్తోరి.
విశ్లేషణ:
ఒక చిన్న స్టోరీలైన్‌కు మద్యంను జోడించి 90 ML అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో సినిమాను తెరకెక్కించిన దర్శకుడు, తాను అనుకున్న కథను అనుకున్నట్లుగా తెరకెక్కించిన విధానం బాగుంది. సినిమా కథనంలో ఫస్టాఫ్‌లో హీరో పరిచయం, మద్యానికి అతడు అలవాటు పడిన తీరును బాగా చూపించారు. ఇక హీరోయిన్‌తో అతడి రొమాంటిక్ ట్రాక్‌ను సింపుల్‌గా చూపించాడు దర్శకుడు. ఈ క్రమంలో వచ్చే కొన్ని సీన్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. అయితే కొన్ని బోరింగ్ సీన్స్ చిత్రంపై ఆసక్తిని తగ్గిస్తాయి. ఒక మంచి ట్విస్టుతో ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుంది.
సెకండాఫ్‌లో హీరో తన ప్రేమను గెలిచేందుకు పడే పాట్లు బాగా చూపించారు. ఈ క్రమంలో అతడు చేసే ఫీట్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్‌లలో హీరో తాగుడు గురించి వచ్చే సీన్స్ ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఒక మంచి నోట్‌పై సినిమాకు శుభం కార్డు పడుతుంది. మొత్తానికి మాస్ సినిమాగా ప్రమోషన్స్ చేసుకున్న 90 ఎంఎల్ సినిమా ఒక పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా అలరించింది.
ఓవరాల్‌గా హీరో కార్తికేయ ఈ సినిమాపై పెట్టుకున్న నమ్మకం నిజం అయ్యింది. సాధారణ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉండటంతో 90 ఎంఎల్ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది. అయితే కొన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాను ఎంజాయ్ చేయలేకపోవచ్చు.
నటీనటుల పర్ఫార్మెన్స్:
మద్యానికి బానిసగా హీరో కార్తికేయ నటన బాగుంది. రొమాంటిక్, ఎమోషనల్ సీన్స్‌లో కార్తికేయ యాక్టింగ్ సూపర్. అటు హీరోయిన్ నేహా సోలంకికి చాలా మంచి పాత్ర లభించింది. ఆమె తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. రావు రమేష్ కూడా చాలా బాగా చేశారు. మిగతా నటీనటులు వారి పరిధిమేర బాగా నటించారు.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు శేఖర్ రెడ్డి రాసుకున్న కథ సాధారణమే అయినా దాన్ని తెరకెక్కించిన విధానం బాగుంది. మద్యం లేనిదే బతకలేని హీరో, మద్యం అంటేనే అసహ్యించుకునే కుటుంబంతో సంబంధం ఎలా కలుపుతాడనే కాన్సెప్ట్ బాగుంది. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ చాలా సహాయపడింది. అనూప్ రుబెన్స్ సంగీతం అంతగా మెప్పించలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా:
90 ML – కిక్కు కొందరికి మాత్రమే ఎక్కుతుంది!
రేటింగ్:
3.0/5.0