తెరపైకి మళ్లీ ఉదయ్ కిరణ్.. బయోపిక్‌కు రంగం సిద్ధం

తెలుగు సినీ ఇండస్ట్రీలో లవర్ బాయ్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుని కొంతకాలానికే కనుమరుగైన హీరో ఉదయ్ కిరణ్. సినిమా అవకాశాలు లేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు ఈ హీరో. ఉదయ్ కిరణ్ సినీ కెరీర్ చాలా ఒడిదుడుకులు చూసింది. అయితే ఇలాంటి కథను తెలుగు ప్రేక్షకులకు సినిమా రూపంలో చూపిస్తే బాగుంటుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.

ఈ క్రమంలో గతంలో దర్శకుడు తేజ ఉదయ్ కిరణ్ బయోపిక్‌ను తెరకెక్కిస్తారంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. కానీ తాను ఉదయ్ కిరణ్ బయోపిక్ తీయడం లేదని తేజ కుండ బద్దలు కొట్టాడు. దీంతో ఆ బయోపిక్ గురించి చర్చలు నిలిచిపోయాయి. కాగా తాజాగా మరోసారి ఉదయ్ కిరణ్ బయోపిక్‌ను ఓ నూతన దర్శకుడు తెరకెక్కించనున్నాడని, ఇందులో హీరోగా సందీప్ కిషన్ నటిస్తాడని వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ బయోపిక్‌కు సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ బయోపిక్ కార్యరూపం దాల్చుతుందా లేదా అనేది మాత్రం ఇప్పటికి సస్పెన్స్‌గానే ఉంది. మరి ఉదయ్ కిరణ్ జీవితం తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుందో లేదో చూడాలి.

Leave a comment