అర్జున్ సురవరం రివ్యూ & రేటింగ్

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ ఎంచుకునే కథలు చాలా సెలెక్టివ్‌గా ఉండటంతో అతడు చేసే సినిమాలను ప్రేక్షకులు ఇష్టపడి చూస్తుంటారు. కాగా కిర్రాక్ పార్టీ సినిమా డిజాస్టర్‌గా నిలవడంతో తన నెక్ట్స్ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని నటించిన సినిమా అర్జున్ సురవరం. అయితే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వరుసగా వాయిదా పడుతూ, ఎట్టకేలకు నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ:
జర్నలిస్ట్ అయిన అర్జున్ లెనిన్ సురవరం(నిఖిల్) ఒక ఫోర్జరీ కేసులో అరెస్ట్ అవుతాడు. అతడి సంతకంతో లోన్ తీసుకుని ఎగ్గొట్టినట్లుగా తేలడంతో అతడు షాక్ అవుతాడు. తాను ఎలాంటి ఫోర్జరీ చేయలేదని అతడు వాదిస్తాడు. కాగా అతడి స్నేహితులైన లావణ్య, వెన్నెల కిషోర్, సత్య అతడిని బయటకు తీసుకువస్తారు. అటుపై ఫేక్ సర్టిఫికెట్ల కారణంగానే అర్జున్‌ ఫోర్జరీ కేసులో ఇరుక్కున్నట్లు తెలుసుకుని, దీని వెనుక ఎవరున్నారనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో అతడికి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. ఇంతకీ సర్టిఫికెట్ల స్కాం వేనుక ఎవరున్నారు? వారిని అర్జున్ పట్టుకుంటాడా? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాను వెండితెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:
నిఖిల్ ఎంచుకునే కథనాలు చాలా వినూత్నంగా ఉంటాయనడానికి అర్జున్ సురవరం సినిమా కూడా ఒక ఉదాహరణగా నలిచిందనే చెప్పాలి. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఫస్టాఫ్‌లో ఇన్వెస్టిగేట్ జర్నలిస్ట్ అయిన అర్జున్ సురవరం ఓ ఫోర్జరీ కేసులో ఇరుక్కుంటాడు. అతడికి తెలియకుండానే అతడిపై కేసు నమోదు అవుతుంది. ఈ క్రమంలో అతడిని కేసులో ఇరికించింది ఎవరు అనే అంశాన్ని తన స్నేహితులతో కలిసి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలోనే అతడికి కొన్ని షాకింగ్ నిజాలు తెలుస్తాయి. ఒక ఆసక్తికరమైన అంశంతో ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుంది.

అటు సెకండాఫ్‌లో విలన్ గ్యాంగ్‌, అర్జున్ మధ్య టామ్ అండ్ జెర్రీ ఆట నడుస్తోంది. విలన్ గ్యాంగ్‌ను పట్టుకునేందుకు అర్జున్ చేసే ప్రయత్నాలు కొన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో వచ్చే కొన్ని ట్విస్టులు చాలా బాగున్నాయి. అటు ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలలో నిఖిల్ ఏం కోల్పోయాడనే అంశాన్ని చూపిస్తూనే, విలన్ గ్యాంగ్ భరతం అతడు ఎలా పట్టాడనే అంశాన్ని చూపించారు.

ఓవరాల్‌గా చూస్తే, ఒక పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన అర్జున్ సురవరం సినిమా నిఖిల్ కెరీర్‌లో మరో హిట్ చిత్రంగా నిలుస్తుంది. సినిమాలోని ట్విస్టులు అదనపు బలంగా నిలిచాయి. ముఖ్యంగా ఇంటర్వెల్, ప్రీ-క్లైమాక్స్ ట్విస్టులు చాలా బాగున్నాయి. దర్శకుడు టి సంతోష్ ఎంచుకున్న కథకు అతడు పూర్తి న్యాయం చేసి నిఖిల్ ఖాతాలో మరో హిట్ సినిమాను వేశాడనే చెప్పాలి. సదరు ప్రేక్షకుడిని ఆకట్టుకోవడంలో అర్జున్ సురవరం సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

నటీనటుల పర్ఫార్మెన్స్:
నిఖిల్ తనదైన నటనతో సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన అర్జున్ సురవరం సినిమాను నిఖిల్ ఒక్కడే తన భుజాలపై మోసాడు. సస్పెన్స్‌ను రివీల్ చేసే సీన్స్‌లో నిఖిల్ యాక్టింగ్ బాగుంది. సినిమాలో హీరోయిన్ లావణ్య త్రిపాఠికి యాక్టింగ్‌కు పెద్దగా స్కోప్‌లేని పాత్రలో నటించింది. అయినా ఉన్నంతలో బాగా చేసింది. ఇక నిఖిల్ స్నేహితుల పాత్రల్లో సత్య, వెన్నెల కిషోర్ బాగా చేశారు. మిగతా నటీనటులు వారి పాత్రల మేర బాగా నటించారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు టి.సంతోష్ డైరెక్ట్ చేసిన తమిళ సినిమా కనితన్‌ను ఎలాంటి మార్పులు లేకుండా అలాగే తెలుగులోనూ రీమేక్ చేశాడు. కథలో బలం ఉండటంతో అయన దర్శకత్వంలో ఎలాంటి లోపాలు మనకు కనిపించలేదు. ఇక సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. కొన్ని సీన్స్‌ చూస్తుంటే అది మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఈ సినిమాకు మ్యూజిక్ కూడా బాగానే తోడయ్యింది. పాటల పరంగా కాకపోయినా బీజీఎంలో సినిమాకు బాగా కలిసొచ్చింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా:
అర్జున్ సురవరం – ఫేక్‌పై నిఖిల్ పోరాటం!

రేటింగ్:
3.0/5.0

Leave a comment