Moviesరాజు గారి గది 3 రివ్యూ & రేటింగ్

రాజు గారి గది 3 రివ్యూ & రేటింగ్

సినిమా: రాజు గారి గది 3
నటీనటులు: అశ్విన్ బాబు, అవికా గోర్, అలీ తదితరులు
సినిమాటోగ్రఫీ: చోటా కె నాయుడు
సంగీతం: షబ్బీర్
దర్శకత్వం: ఓంకార్

రాజు గారి గది సినిమాతో తెలుగు తెరకు హార్రర్ కామెడీని కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసి దర్శకుడిగా మారాడా ఓంకార్. ఆ తరువాత అదే తరహాలో వచ్చిన రాజు గారి గది2 సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఇప్పుడు ఇదే కోవలో రాజు గారి గది 3 అనే సినిమాతో ఓంకార్ మరోసారి ప్రేక్షకులను నవ్విస్తూ భయపట్టేందుకు రెడీ అయ్యాడు. నేడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న రాజు గారి గది 3 చిత్రం ప్రేక్షకులను ఎంతమేర మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

కథ:
ఆటో డ్రైవర్‌గా పని చేసే అశ్విన్ చాలా సాదాసీదా జీవిస్తుంటాడు. అయితే ఓ కాలనీలో ఉండే అవికాను చాలా మంది ప్రేమిస్తున్నామని వెంటబడతారు. అయితే కొన్ని కారణాల వల్ల వారంతా చనిపోతారు. ఈ క్రమంలో అదే కాలనీలో ఉండే అశ్విన్‌ అవికాను ప్రేమించేలా చేయాలని చూస్తారు కాలనీవాసులు. ఈ క్రమంలో కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఇంతకీ అవికా ఎవరు? ఆమెను ప్రేమిస్తున్నామని చెప్పినవారు ఎందుకు చనిపోతున్నారు.? అశ్విన్ కూడా చనిపోతాడా? అనేది సినిమా కథ.

విశ్లేషణ:
హార్రర్ సినిమాలో కామెడీ జోడించి ప్రేక్షకులను మెప్పించడంలో ఓంకార్ పూర్తిగా సక్సెస్ అయ్యాడు. ఇక ఇప్పుడు ‘రాజు గారి గది 3’ సినిమాతో మరోసారి మనముందుకు అదే జోనర్‌‌తో వచ్చాడు. ఇక ఫస్టాఫ్‌లో పాత్ర పరిచయాలు, వారికి సంబంధించిన విషయాలను మనకు చూపించాడు దర్శకుడు ఓంకార్. ఇక అవికాకు లవ్ ప్రపోజ్ చేసేవారు అకస్మాత్తుగా చనిపోతుండటంతో అందరిలో ఆందోళన మొదలవుతుంది. కాగా ఆటో డ్రైవర్ అశ్విన్ కాలనీవాసులను ఇబ్బందులకు గురిచేస్తుండటంతో అతన్ని అవికాను లవ్ చేసేలా ప్రయత్నాలు చేస్తారు కాలనీవాసులు. ఈ క్రమంలో ఓ అదిరిపోయే ట్విస్టుతో ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుంది.

అటు సెకండాఫ్‌లో అవికాను ఓ ప్రేతాత్మ వెంటాడుతుందని.. అది ఆమెను ఎవరికీ దక్కకుండా చేస్తుందనే విషయం తెలుసుకున్న అశ్విన్, ఆ ప్రేతాత్మ అంతు చూసేందుకు కేరళ వెళతాడు. అక్కడ భూతవైద్యుల సాయంతో ఆ ప్రేతాత్మ ఎవరిదనేది అశ్విన్ కనుక్కునే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో అతడికి ఓ షాకింగ్ విషయం తెలుస్తోంది. మరి అశ్విన్ ఆ ప్రేతాత్మను ఎలా ఎదుర్కొన్నాడు. ఈ సమస్య నుండి అతడు బయట ఎలా పడ్డాడనే ట్విస్టులతో ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ వస్తాయి. దీంతో సినిమా కథ ముగుస్తుంది.

ఓవరాల్‌గా చూస్తే హార్రర్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నప్పటికీ అదిరిపోయే కామెడీ టైమింగ్‌తో ఈ సినిమాను ఓంకార్ అన్ని వర్గాల ఆడియెన్స్‌కు నచ్చే విధంగా తెరకెక్కించాడు. మొత్తానికి ‘రాజు గారి గది’ సీరీస్ బ్రాండ్‌ను ఓంకార్ మరోసారి సక్సెస్‌ఫుల్‌గా తీర్చిదిద్దాడు.

నటీనటుల పర్ఫార్మెన్స్:
ఆటో డ్రైవర్‌గా అశ్విన్ బాబు నటన బాగుంది. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో మనోడు యాక్టింగ్ విషయంలో చాలా ఇంప్రూవ్ అయ్యాడు. ఇక చిన్నారి పెళ్లికూతురు ఫేం అవికా గోర్ చాలా కాలం తరువాత స్ట్రెయిట్ తెలుగు మూవీలో నటించింది. హార్రర్ సీన్స్‌లో అమ్మడి యాక్టింగ్ సూపర్. ఈ సినిమాకు మరో మేజర్ అసెట్ కమెడియన్ అలీ. ఆయన పండించిన కామెడీ సినిమాకు బాగా కలిసొచ్చింది. మిగతావారు తమ పరిధిమేర బాగా నటించారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
ఓంకార్ తాను అనుకున్న ప్రకారమే సినిమా కథను పక్కాగా తెరకెక్కించాడు. ఈ సినిమాతో మరోసారి హార్రర్ కామెడీ జోనర్‌తో ఆడియెన్స్‌ను మెప్పించాడు. కథను ఎక్కడా పక్కదారి పట్టించకుండా చూశాడు ఓంకార్. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ బాగుంది. షబ్బీర్ అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా హార్రర్ సీన్స్‌లో వచ్చే బీజీఎం బాగుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

చివరగా:
రాజు గారి గది 3 – నవ్వుతూ భయపెట్టిన ఓంకార్

రేటింగ్:
3.25/5.0

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news